ఏపీ ఇంటర్ పరీక్షలపై క్లారిటీ వచ్చేసినట్టే..!

ఏపీలో ఇంటర్ పరీక్షలపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసింది. పరోక్షంగా ఎంసెట్ డేట్లు ప్రకటించేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఇంటర్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటివరకూ ఇంజినీరింగ్ అండ్ మెడికల్…

ఏపీలో ఇంటర్ పరీక్షలపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసింది. పరోక్షంగా ఎంసెట్ డేట్లు ప్రకటించేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఇంటర్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటివరకూ ఇంజినీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EAMCET) అనే పేరుతో ఎంసెట్ నిర్వహించేవారు. అయితే నీట్ పేరుతో జాతీయ స్థాయిలో మెడికల్ స్టూడెంట్స్ కి పరీక్షలు నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

దీంతో ఎంసెట్ లో మెడికల్ కు స్థానం లేకుండా పోయింది. ఈ దఫా మెడికల్ పేరు తీసేసి ఫార్మసీ, అగ్రికల్చర్ ని యాడ్ చేసి ఏపీ ఎంసెట్ కి కొత్త రూపు తెచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఈఏపీసెట్.. అంటే ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EAPCET) పేరుతో ఈ ఏడాది నుంచి ఎంట్రన్స్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.

ఈఏపీసెట్ కు ఈనెల 24న నోటిఫికేషన్ విడుదలవుతుంది. 26 నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారు. జులై 25 వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. ఆగస్ట్ 19నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈమేరకు విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

వాస్తవానికి ఈఏపీసెట్ రాయాలంటే ఇంటర్మీడియట్ పూర్తి కావాల్సి ఉంటుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు కూడా ఇంజినీరింగ్ లో చేరేందుకు ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. అంటే ఈఏపీసెట్ (ఎంసెట్) జరిగేలోపు ఇంటర్ పరీక్షలపై పూర్తి క్లారిటీ వచ్చేస్తుందనమాట.

జులైలో ఇంటర్, టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ దాదాపుగా ప్రయత్నాలు పూర్తి చేసింది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పరీక్షలు పెట్టేందుకు రెడీ అంటున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఈలోగా ఎంట్రన్స్ పరీక్షల తేదీలు కూడా ప్రకటించేశారు కాబట్టి.. ఇంటర్ పరీక్షలపై దాదాపుగా క్లారిటీ వచ్చేసినట్టే అనుకోవాలి.