ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు వస్తే.. వాటిపై కోర్టుకు వెళ్తామంటూ ప్రకటించింది ఏపీ ఎన్జీవో సంఘం. ఏపీలో ఇంకా కరోనా వ్యాప్తి కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు ఏమిటని ఏపీ ఎన్జీవో సంఘం ప్రశ్నిస్తోంది.
ఎన్నికలు నిర్వహించక తప్పదని ఈసీ ఆదేశిస్తే.. ఈ విషయంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని ఏపీ ఎన్జీవో సంఘం ప్రకటించింది. తమ ఉద్యోగుల ప్రాణాలను కాపాడుకోవడం కూడా తమకు ముఖ్యమైన అంశమని ఏపీ ఎన్జీవో అంటోంది.
వాస్తవానికి ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర ప్రభుత్వ ఉద్యోగులది, పోలీసులదే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎంతోమంది ఉద్యోగులకు ప్రాణం మీదకు వచ్చింది. అనేక మంది పోలీసులు కరోనా లాక్ డౌన్ ల సమయంలో విధులను నిర్వర్తించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంగతిని మరవలేం. ఏపీలో కరోనా సోకడంతో మరణించిన పోలీసుల జాబితా పెద్దగానే ఉంటుంది. డాక్టర్లు, నర్సుల తర్వాత కరోనా బారిన ఎక్కువగా పడిన వారిలో పోలీసులున్నారు.
ఉద్యోగులన్నాకా అన్ని వయసుల వారూ ఉంటారు. వారంతా ఎన్నికల విధుల్లో పాల్గొనక తప్పకపోవచ్చు. కరోనా నివురుగప్పిన నిప్పు అని అధ్యయనకర్తలు స్పష్టం చేస్తున్నారు. సెకెండ్ వేవ్ హెచ్చరికలు చేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో కాస్తా వాయిదా వేసుకోవడం వల్ల నష్టం లేని ఎన్నికలను నిర్వహించడాన్ని ప్రతిష్టగా తీసుకోవడం ఎంతవరకూ సబబు? అనేది ఆలోచించాల్సిన అంశం.
అవసరం లేకపోతే బయటకు రావొద్దని ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తూ, మరోవైపు అనేక మందిని కరోనా ముందుకు తీసుకెళ్లేలా ఉన్నాయి ఎన్నికలు. ఈ పరిస్థితుల్లో ఎవరి భయాలు వారికి ఉండనే ఉంటాయి. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు తమ మాటను చెబుతున్నారు. మరి ఉద్యోగుల విన్నపాలను ఎన్నికల కమిషన్ వారు ఏ మేరకు పట్టించుకుంటారో!