స్థానిక ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ ఎందుకంత పట్టుబడుతూ ఉంది? అనేది ఒకరకంగా అంతుబట్టని విషయం. ఎవరినో చూసుకుని టీడీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిపోవాలన్నట్టుగా భావిస్తున్నట్టుంది.
అయితే.. అంతిమంగా ఓటేయాల్సింది ప్రజలు. వారిలో తమ పట్టేమిటో తెలుగుదేశం మరిచిపోయినట్టుంది! ఏడాదిన్నర కిందట జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన చరిత్రలోనే ఎన్నడూ చిత్తు కాని రీతిలో చిత్తయ్యింది! 2004 ఎన్నికలతో పోల్చినా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది.
2004లో సీట్లు మాత్రమే పోయాయి. 2019లో తెలుగుదేశం అభ్యర్థులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సాధించిన మెజారిటీలను చూస్తే దిమ్మతిరిగిపోతుంది!
అనామకులు 30 వేలు, 40 వేలు, 50 వేలు.. 60, 70 వేల మెజారిటీలు సాధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తన సమీప తెలుగుదేశం అభ్యర్థిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత భారీ మెజారిటీతో రాష్ట్రంలోనే నంబర్ వన్ ప్లేస్ లో నిలవగా, ఆ తర్వాత అనేక మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు భారీ భారీ మెజారిటీలను సాధించారు.
తెలుగుదేశం కంచుకోటల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30 వేలు అంతకు మించిన మెజారిటీలను సాధించి ఔరా అనిపించింది!
టీడీపీ చిత్తైన ఓటమి నుంచి ఆ పార్టీని అనుకూల మీడియా కోలుకునేలా చేయడంలో తీవ్ర ప్రయత్నమే చేస్తోంది. ఇక ఎన్నికలైన ఏడాదిన్నరలో తెలుగుదేశం చేసింది ఏమిటి? అంటే.. ఏమీ లేదు! పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన నేతలే ఇప్పుడు జనం మధ్యన అడ్రస్ లేరు.
స్వయంగా ఆ పార్టీ అధినేత హైదరాబాద్ లో సెటిలయిపోయారు. కరోనా కారణంగా పచ్చచొక్కాలతో కూడా ఆయన కలవడం లేదని స్పష్టం అవుతోంది. లోకేష్ జనం మధ్యకు వస్తే అది కామెడీనే అవుతోంది, టీడీపీలోనే కంగారు పుట్టిస్తోంది!
మరోవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే శరవేగంగా అన్ని హామీలనూ నెరవేరుస్తూ ఉన్నారు. ఇది మరో సంచలనమే. అందుకు ఫలితాలు జగన్ కు దక్కకుండా పోయే అవకాశమే లేదు! కొంత వరకూ పార్టీ క్యాడర్ లోనే అసంతృప్తి ఉన్నా.. పచ్చబ్యాచ్ ఆగడాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొత్త కసిని పుట్టిస్తున్నాయి!
కోర్టు తీర్పులు తెలుగుదేశం పార్టీ పై సామాన్య ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతున్నాయంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు! మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండటం, ఇతర వ్యవస్థలకు సంబంధించిన అంశాలు… చంద్రబాబు నాయుడు స్వకులస్తులను అడ్డం పెట్టుకుని తనకు ప్రమాదం రాకుండా చూసుకుంటున్నాడు అనే అభిప్రాయాలు జనాల్లోకి బలంగా వెళ్లడం.. వీటన్నింటినీ పరిశీలిస్తే.. సార్వత్రిక ఎన్నికల నాటికి మించిన ప్రజా వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ పై ఉండే అవకాశాలు లేకపోలేదు.
స్థానిక ఎన్నికల్లో తాము నామినేషన్లు కూడా వేయలేకపోయిన చోట ఇప్పుడు ఏకగ్రీవాలను రద్దు చేయాలంటూ టీడీపీ డిమాండ్ చేస్తోంది! తమ పరపతిని ఉపయోగించుకుని టీడీపీ అంత పనీ చేయించుకోవచ్చు గాక.. కానీ ఓట్లేసేది మాత్రం ప్రజలు. వారిని పక్కన పెట్టి టీడీపీ మిగతావన్నీ చేస్తోంది. అందుకు ఓటు రూపంలో గట్టి దెబ్బే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.