తన ప్రధాన ప్రత్యర్థి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్కసుతో ఏకంగా ఏపీ ప్రయోజనాలకే భంగం వాటిల్లేలా ప్రతిపక్ష నేత, సీనియర్ రాజకీయ నేత నారా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జగన్‌ను దెబ్బ కొట్టేందుకు ఏకంగా తెలంగాణకు మద్దతుగా నిలుస్తున్నారా? అంటే, ఔననే సమాధానం వస్తోంది.
ముఖ్యంగా రాయలసీమకు సాగు, తాగునీరు అందించే విషయంలో చంద్రబాబు అయిష్టంగా ఉన్నారనే విమర్శలున్నాయి. వాటికి బలం కలిగించేలా ప్రస్తుతం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రజానీకం మండిపడుతోంది. పైగా చంద్రబాబును తెలంగాణ అధికార పార్టీ నేతలు నామ మాత్రంగా కూడా విమర్శించక పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఏపీలో ఒక చర్చ మొదలైంది.
సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించి, ఆమోదం పొందే వరకూ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవద్దని కృష్ణానదీ యాజమాన్య బోర్డు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదేశించింది. అంత వరకు పనులు ఆపాలని బోర్డు తరపు సభ్యుడు హెచ్‌కే మీనా ఆంధ్రప్రదేశ్ జలవనరుల కార్యదర్శికి లేఖ రాశారు. దీంతో ఏపీలో వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకు సాగునీళ్లు అందించాలన్న ప్రభుత్వ ఆశయానికి అడ్డంకి ఏర్పడింది. ఈ పాపంలో చంద్రబాబు పాత్ర కూడా ఉందని రాయలసీమలోని సాగు నీటి నిపుణులు, ఆ ప్రాంత ఉద్యమకారులు మండిపడుతున్నారు.
సీమకు సాగునీళ్లు అందించే ప్రాజెక్టుల నిర్మాణంపై తెలంగాణ అభ్యంతరాలు, మరోవైపు చంద్రబాబు మౌనం పాటించడం అంతా స్క్రిప్ట్‌లో భాగమే అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పని చేసిన చంద్రబాబుకు ఏనాడూ తనకు రాజకీయ జన్మనిచ్చిన రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే ఆలోచన రాలేదని, ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు మాత్రం ఆయన ముందున్నారని సీమ సమాజం రగిలిపోతోంది.
కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణ పనులను చేపట్టిందని, వెంటనే వాటిని అడ్డుకోవాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కోరుకున్నట్టుగానే ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆగమేఘాలపై లేఖ రాయడం గమనార్హం.
కృష్ణా నదిపై ఏపీ ప్రాజెక్టులు నిబంధనలకు విరుద్ధమని… ఈ ప్రాజెక్టుతో పాలమూరు ఎడారిగా మారే ప్రమాదం ఉందని తెలంగాణ వాపోతోంది. కానీ నీళ్ల కేటాయింపులకు లోబడే తాము ప్రాజెక్టులు చేపడుతున్నామని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. తెలంగాణ ప్రభుత్వమే నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది.
ప్రస్తుతం రెండు రాష్ట్రాల తలెత్తిన సాగునీటి ప్రాజెక్టుల వివాదాన్ని చూస్తే… వైసీపీ వర్సెస్ తెలంగాణ అన్నట్టుగా తయారైంది. ఎందుకంటే ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ సాగునీటి విషయమై తమకేమీ సంబంధం లేదని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందనే విమర్శలు న్నాయి. పైగా పరోక్షంగా తెలంగాణ సర్కార్‌కు అనుకూలంగా తన మౌనంతో మద్దతు ఇస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి.
తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శలను పరిశీలిస్తే …దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు ఏపీ ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, రవీంద్రనాథ్ రెడ్డిలతో పాటు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాత్రమే ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అందుకే చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల మౌనంపై ప్రతి ఒక్కరిలో అనుమానాలు కలుగుతున్నాయి.
జగన్‌ను కట్టడి చేసేందుకు రాయలసీమకు సాగునీళ్లు అందించకుండా కేసీఆర్‌తో చంద్రబాబు కుమ్మక్కు అయ్యారనే విమర్శలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి స్పందించే తండ్రీతనయులు చంద్రబాబు, లోకేశ్… సీమ సమాజానికి సాగునీళ్లు అందించే ప్రాజెక్టులపై తలెత్తిన వివాదంపై మాత్రం నోరు మెదపకపోవడంతో, చాలా మంది నోరు చేసుకోవాల్సి వస్తోందని అంటున్నారు. అయితే కేసీఆర్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ సమాజానికి వ్యతిరేకంగా బాబు పన్నే కుట్రలు ఎంతో కాలం దాగవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒక వైపు ఏపీలో ముఖ్యమంత్రి పదవి మాత్రం కావాలి, మరోవైపు ఆ రాష్ట్రానికి వ్యతిరేకంగా బాహుబలిలో కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తున్నారని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.