అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన టీటీడీ పాలక మండలి కథ ముగిసింది. పాత చైర్మన్ ని అదే స్థానంలో వెంటనే తిరిగి నియమించేందుకు జగన్ ఇష్టపడలేదు, అలాగని కొత్త చైర్మన్ ని కూడా ప్రకటించ లేదు. మధ్యేమార్గంగా ఈవోకి బాధ్యతలు అప్పగించారు. స్పెసిఫైడ్ అధారిటీ టీటీడీ పాలన చేపట్టింది. పాలకమండలి కాలం ముగిసిందని చెప్పి వీడ్కోలు ఇచ్చేశారు. మరి మంత్రి వర్గం విషయంలో కూడా జగన్ అదే మాటపై ఉంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశం.
టీటీడీ పాలక మండలి రెండేళ్ల కాలపరిమితి పూర్తయిన వెంటనే స్పెసిఫైడ్ అధారిటీకీ బాధ్యతలు అప్పజెప్పడం ద్వారా, జగన్ మాటంటే మాటేనని మరోసారి రుజువైంది. మంత్రి మండలి విషయంలో కూడా జగన్ అదే మాటపై ఉంటారని తెలుస్తోంది.
పాతవారి పనితీరు మదింపు చేయడం, కొత్తవారికి అవకాశం ఇవ్వడం, సామాజిక సమతూకం చెడకుండా.. మంత్రి వర్గంలో ఇప్పటి వరకూ స్థానం పొందని కులాలను చేర్చడం.. ఇలా జగన్ మదిలో చాలా ఆలోచనలున్నాయి. అవన్నీ అమలు చేయడానికి ఆయన రెండేళ్లను కాలపరిమితిగా పెట్టుకున్నారు.
కానీ కరోనా కాలంలో ఎవరి పనితీరు ఏంటనేది పూర్తి స్థాయిలో బయటపడలేదు. అధికారం చేపట్టిన తర్వాత ఆ శాఖ పనులకు కరోనా అడ్డంకిగా మారిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి జగన్ వీటిని కన్సిడర్ చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.
వాస్తవానికి మంత్రి మండలిలో మార్పులు, చేర్పుల కోసం కరోనా సాకు చెప్పడానికి జగన్ కి ఇష్టం లేదు. ఈపాటికే ఆయన ఓ లిస్ట్ తయారు చేసుకున్నారనే ప్రచారం నడుస్తోంది. టీటీడీ పాలకమండలిని యథాతథంగా కొనసాగించడానికి జగన్ ఎలా ఇష్టపడలేదో.. అలాగే మంత్రి మండలిని కూడా యథాతథంగా కొనసాగించడానికి ఇష్టపడటంలేదని తెలుస్తోంది.
గతంలో దాదాపుగా యువతకు పెద్దపీట వేసిన జగన్, ఈ దఫా అసంతృప్త సీనియర్లకు అవకాశం ఇస్తారని అంటున్నారు. దాదాపుగా ప్రతి జిల్లాలోనూ ఇలాంటి బ్యాచ్ ఒకటి ఉంది, ఇటీవల స్థానిక ఎన్నికల్లో వీరి కష్టం బాగా ఎక్కువ. మంత్రి పదవి ఆశతో గుంపగుత్తగా ఏకగ్రీవాలు సాధించారు, వైసీపీ జెండా రెపరెపలాడించారు. ఈ దశలో వారి కష్టాన్ని పరిగణలోకి తీసుకోవడం కూడా సమంజసమే.
అందుకే జగన్ మంత్రి వర్గ విస్తరణ విషయంలో ముందుకే వెళ్తారని అంటున్నారు. మార్పులు, చేర్పుల తర్వాత అలకలు, బుజ్జగింపులు సాధారణమే అయినా అవి ఏ స్థాయిలో ఉంటాయనేదే ఇప్పుడప్పుడే చెప్పలేం. అయితే టీడీపీ ఆశిస్తున్నట్టు పార్టీ మార్చే స్థాయిలో రెబల్స్ తయారవ్వకపోవచ్చు.