ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి ఎలాంటి కరోనా కేసులు నమోదవ్వలేదని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు తాజాగా మరో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. వివిధ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు మొత్తంగా 441 మంది ప్రయాణికులు వచ్చారని స్పష్టంచేసిన సర్కార్ వాళ్లందర్నీ అబ్జర్వేషన్ లో ఉంచామని ప్రకటించింది.
వీళ్లలో 206 అనుమానిత ప్రయాణికుల్ని బయటకు రాకుండా ఇంట్లోనే ఉంచామని తెలిపిన ప్రభుత్వం.. మరో 225 మందికి 28 రోజుల అబ్జర్వేషన్ పూర్తయినట్టు ప్రకటించింది. వివిధ హాస్పిటల్స్ లో ఉన్న 10 మంది అనుమానిత రోగుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 34 మంది అనుమానిత రోగుల శాంపిల్స్ ను పరీక్షించగా.. వాళ్లలో 29 మందికి నెగిటివ్ వచ్చినట్టు తేలింది. మరో ఐదుగురు శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది.
కరోనాపై అవగాహన కోసం 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ ను ఏర్పాటుచేసినట్టు తెలిపిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వం హాస్పిటల్స్, జిల్లా హాస్పిటల్స్ లో ఐసోలేటెడ్ వార్డుల్ని ఏర్పాటుచేసినట్టు ప్రకటించింది. వైరస్ సోకినట్టు అనుమానం ఉన్న ఎవరైనా, ఏ ప్రభుత్వాసుపత్రికైనా వెళ్లి ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చని, టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు మెడికల్ షాపులపై కూడా కన్నేసింది సర్కార్. ఎమ్ఆర్పీ కంటే ఎక్కువ రేటుకు మాస్కులు, శానిటైజర్లను అమ్ముతున్న షాపుల లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేస్తోంది. అలా ఇప్పటివరకు 9 మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు చేశామని ప్రకటించింది. రాష్ట్రంలో మాస్కులు కావాల్సినన్ని అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 102 దేశాలకు కరోనా వ్యాపించింది.