ఏపీలో పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అత్యధిక శాతం ఏకగ్రీవాలు నమోదు అయిన జిల్లాల్లో ఏకగ్రీవ విజయాల ప్రకటనలను ఆపాలని ఆయన కలెక్టర్లను ఆదేశించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
అసలు అక్కడ ఎందుకు అన్ని ఏకగ్రీవాలు చోటు చేసుకున్నాయో తనకు పూర్తి వివరణలు ఇవ్వాలని నిమ్మగడ్డ ఆదేశించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ముందుగా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాల మీద నిమ్మగడ్డ మీద దృష్టి సారించారట.
చిత్తూరు జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 25 శాతం ఏకగ్రీవం అయ్యాయి. ప్రతి నాలుగు పంచాయతీల్లో ఒక పంచాయతీ ఏకగ్రీవంగా అక్కడ ఎన్నిక లాంఛనమైంది. గుంటూరు జిల్లా విషయానికి వస్తే.. దాదాపు ప్రతి ఐదు పంచాయతీలకూ ఒక పంచాయతీ ఏకగ్రీవం అయ్యింది. ఈ జిల్లాలపై ముందుగా నిమ్మగడ్డ దృష్టి సారించారట.
పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తుల మీద జరగవని వేరే చెప్పనక్కర్లేదు. కాబట్టి వీటిల్లో ఏకగ్రీవాల విషయంలో కూడా పార్టీలు అతిగా ఓన్ చేసుకోవడానికి ఏమీ ఉండదు. అయినా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీటిని ఆక్షేపిస్తూ ఉన్నట్టుగా ఉండటం గమనార్హం!
ఏకగ్రీవాలు అత్యధికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లవే అని అంటున్నాయి తెలుగుదేశం అనుకూల పత్రికలు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల శాతం 10 కూడా లేదని ఆ పత్రికలు చెబుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకగ్రీవాల మీద దృష్టి సారించినట్టుగా వార్తలు వస్తూ ఉండటం విశేషం.
ఇప్పటికే రాజకీయ నేత తరహాలో మాట్లాడి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రజల్లో కూడా సందేహాలను రేకెత్తించారు. కడప జిల్లాకు వెళ్లి వైఎస్ఆర్ ను పొగడటం, ఆ తర్వాత సీబీఐ కేసుల గురించి ఆయన మాట్లాడటం తీవ్ర వివాదాస్పదమే. తను స్వతంత్ర వ్యవస్థకు ప్రతినిధినంటూ చెప్పుకుంటూ.. నిమ్మగడ్డ పచ్చి రాజకీయ నేతలా మాట్లాడారు.
ఈ విషయాన్ని విశ్లేషకులు ఆక్షేపించారు. ఇలాంటి నేపథ్యంలో.. ఆయన తాజా నిర్ణయం మరింత సంచలనం అవుతోంది. ఎంత పల్లెల్లో ఏకగ్రీవం అయినా.. నూటికి ఎవరో ఒకరు అభ్యంతరాలు చెప్పే వాళ్ల ఉండనే ఉంటారు. అలాగని వారు ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తితో, శక్తితో లేకపోవచ్చు. అలాంటి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటే.. అన్ని ఏకగ్రీవాలనూ రద్దు చేసేయవచ్చు కూడా! అయితే ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే పద్ధతి ప్రభుత్వమే చాలా కాలం కిందట ప్రకటించింది. అయితే ఎన్నడూ లేని రీతిలో ఈ సారి మాత్రం ఏకగ్రీవాల విషయంలో ఎస్ఈసీ తీవ్రంగా అభ్యంతరాలను చెబుతూ ఉండటం గమనార్హం!