cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: జాంబీ రెడ్డి

సినిమా రివ్యూ: జాంబీ రెడ్డి

చిత్రం: జాంబీ రెడ్డి
రేటింగ్‍: 2/5
తారాగణం: సజ్జ తేజ, దక్ష నగర్కర్, ఆనంది, హర్షవర్ధన్, కిరీటి దామరాజు, మిర్చి హేమంత్, గెటప్ శ్రీను, వినయ్ వర్మ, పృథ్వి, విజయ రంగ రాజు, హరితేజ తదితరులు 
మ్యూజిక్‍: మార్క్. కె. రాబిన్
ఎడిటింగ్‍: సాయిబాబు 
ఛాయాగ్రహణం: అనిత్ 
నిర్మాత: రాజశేఖర్ వర్మ
రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
విడుదల తేదీ: ఫిబ్రవరి 5, 2021

కరోనా లాక్డౌన్ టైములో కరోనా కథాంశంతో తయారవుతోందని ఎనౌన్స్ అయిన ఈ సినిమా కాస్త ఆసక్తి రేకెత్తించింది. పెద్ద స్టార్స్ లేకపొయినా "అ!", "కల్కి" వంటి వైవిధ్యభరితమైన సినిమాలు తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకుడు కావడం ఈ చిత్రం పై అంచనాలు కూడా పెంచాయి. దానికి తోడు టైటిల్ కూడా వెరైటీగా ఉండడంతో మీడియా కళ్లు కూడా ఇటువైపు తిరిగాయి. ఈ రోజు విడుదలైన ఈ జాంబీ రెడ్డి ఎలా ఉందో తెలుసుకుందాం. 

అనుకున్నట్టుగానే ప్రశాంత్ వర్మ కథని కరోనా వ్యాక్సిన్ సన్నివేశంతో మొదలుపెట్టాడు. కానీ మళ్లీ చివరి వరకు దాని ప్రస్తావన ఉండదు. మధ్యలో ఉన్నదంతా దశాబ్దాల క్రితం వచ్చి పోయిన అనేక జాంబీల సినిమాల్లంటి కథల్లో ఒకానొక మూస కథ. ఎక్కడా కొత్తదనం కానీ, ట్విస్ట్ కానీ ఉండదు. అన్నీ ప్రెడిక్టిబుల్ గా జరుగుతుంటాయి. సీరియస్ హారర్ సినిమాగా కాకుండా మారుతి మార్కు హారర్ కామెడీ పండించే ప్రయత్నం చేసాడు. అలాగని పగలబడి నవ్వుకూనే సందర్భాలు కూడా లేవు. ఈ మాత్రం సినిమా ఎవరైనా తీయగలరు..కానీ ప్రశాంత్ వర్మ వంటి దర్శకుడి నుంచి ఆశించే స్థాయిలో లేదు. 

నలభై ఏళ్ల క్రితం వచ్చిన ఈవిల్ డెడ్ లాంటి సినిమాలు, జాంబీల కాన్సెప్ట్ తో రూపొందించిన ముప్పై ఏళ్లనాటి మైకేల్ జాక్సన్ "థ్రిల్లర్" ఆల్బం లోని ఒక సాంగ్, ఆ పాటని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చిరంజీవి పై చిత్రీకరించిన "దొంగ" సినిమాలోని గోలిమార్ పాట, పెళ్లికూతురు గెటప్పులో చంద్రముఖి, మర్యాదరామన్న ని గుర్తుకు తెచ్చే సీమ బ్యాక్ డ్రాప్, గుడి సీన్ తో ఎండ్ అయ్యే కాంచన క్లైమాక్స్, నీటిలో తడిపి పిచ్చిని వదిలించే "జంబకలిడి పంబ" క్లైమాక్స్...ఇలా చాలా సినిమాలకి చెందిన స్పూఫుల్లాంటి సన్నివేశాల సమాహారమే ఈ "జాంబీ రెడ్డి". 

కొన్ని సీన్స్ అతిగా, లాజిక్ లేకుండా విసిగిస్తాయి. మొదటి నుంచి చివరి వరకు "కొరుకుడు" సీన్స్ మీదే నడిచిన స్క్రీన్ ప్లే కొరుకుడు పడడం కొంచెం కష్టమే. కరోనా వ్యాక్సీన్ ఎలిమెంట్ ని వాడుకోవడం కేవలం మార్కెటింగ్ టెక్నిక్ తప్ప ఇంకొకటి కాదు. కరోనా అంశానికి సంబంధం లేకుండా కూడా ఈ సినిమా తీయొచ్చు. 

బాలనటుడి నుంచి హీరో గా ప్రొమోషన్ పొందిన సజ్జ తేజ బాగానే నటించాడు. అయితే కొట్టచ్చినట్టు కనిపించే ప్రత్యేకత మాత్రం ఇతనిలో ఏమీ కనపడలేదు. అర్బన్ బ్యూటీగా కనిపించే దక్ష నగర్కర్ పర్వాలేదు. నందిని రెడ్డిగా నటించిన ఆనంది మాత్రం గుర్తుండేలా ఉంది. ఆకర్షణీయమైన ముఖంతో పాటూ అభినయం కూడా చూపించింది. ఎప్పుడో ఈరోజుల్లో, బస్ స్టాప్ లాంటి సినిమాల్లో నటించి తర్వాత తమిళ తెరకి అంకితమైన ఈ వరంగల్ ట్యాలెంట్ మళ్లీ ఇక్కడ కనిపించింది. గెటప్ శ్రీను ఆకట్టుకున్నాడు. ఒకటి రెండు సీన్స్ లో కనిపించిన హరి తేజ చంద్రముఖి గెటప్ లో కామెడీ లాంటి పిచ్చి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మిర్చీ హేమంత్ అమాయక పెళ్లికొడుకుగా సరిపోయాడు. ఒకప్పటి నాగిరెడ్డి తరహా పాత్రలో వినయ్ వర్మ నిండుగా కనిపించాడు. 

ఏమాటకా మాట చెప్పుకోవాలి. ఈ సినిమాకి హైలైట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్. చాలా మాడర్న్ గా, కొత్తగా వినిపిస్తూ సన్నివేశాల మూడ్ ని నిలబెట్టింది నేపథ్య సంగీతం. "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ" కి పని చేసిన మార్క్. కె. రాబిన్ స్వరకల్పన చెప్పుకోదగ్గదిగా ఉంది. అలాగే అనిత్ ఛాయాగ్రహణం కూడా మెచ్చుకోదగ్గ విధంగా ఉంది. ఈ రెండు ఫ్యాకల్టీస్ కారణంగా సినిమా సాంకేతికంగా బాగుందనిపిస్తుంది. 

ఏదో కొత్తదనం, ఎంతో అనుభూతి ఇస్తుందనుకున్న జాంబీ రెడ్డి బుర్రని కొరుక్కు తినేసింది. సినిమా పూర్తయ్యాక థియేటర్లో సీట్ల మధ్యలోంచి నడుచుకుంటూ వస్తున్న ప్రేక్షకులు కూడా వేలాడిపోతూ జాంబీల్లాగానే కనిపించారంటే..ఇక అర్థం చేసుకోండి. 

బాటం లైన్: కొరకరాని కొయ్య.

 


×