ఇప్పుడీ నాటకాన్ని నిషేధించాలని ఆర్యవైశ్య సంఘం ప్రభుత్వంపై వత్తిడి తెస్తోంది. ఏపీ ప్రభుత్వం ఈ నాటక ప్రదర్శన నిలిపివేసే ఆలోచనలో ఉంది. ఈ విషయంలో ఆర్యవైశ్య సంఘం అభిప్రాయం సమర్ధనీయమే. చర్చించవచ్చు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేక మూడు రాజధానులు వంటి తీవ్రమైన రాజకీయ అంశం కాదుకాబట్టి, దీనిపై ఎలాంటి చర్చ చేసినా “పచ్చ బ్యాచ్” అనో “పేటియం బ్యాచ్” అనో ముద్ర వేసే అవకాశం లేదు కాబట్టి శ్రీనివాసరావు గారి పోస్టుపై చర్చ చేయవచ్చు.
“చింతామణి” ఒక సామాజిక నీతితో కూడిన ఒక సాంఘిక నాటకం. వ్యసనానికి బానిసలైన వ్యక్తులు ఎలా తమ జీవితాలను నాశనం చేసుకుంటారో చెప్పే ఒక సామాజిక బాధ్యతతో కూడిన నాటకం. వ్యసనానికి బానిసలైన వారిలో అనేక కులాలవారు ఈ నాటకంలో కనిపిస్తారు.
తొలినాళ్ళలో ఈ నాటకం బాగానే ఉండేది. ఊరంతా కుటుంబమంతా కలిసి ఈ నాటక ప్రదర్శన ఆస్వాదించేవారు. కానీ కాలక్రమంలో చింతామణి, చిత్ర పాత్రల నిడివి పెంచి శృంగార రసం పాళ్ళు పెంచారు. అప్పుడే మహిళా ప్రేక్షకుల సంఖ్య తగ్గింది.
ఆ తర్వాత సుబ్బిశెట్టి పాత్ర రూపాన్ని మార్చి, పాత్రకు అమాయకత్వం జోడించి, హాస్యం పేరుతో వెకిలితనం కలబోసి ఇతర పాత్రల నిడివి తగ్గించి నాటకం వేయడంతో నాటక ప్రయోజనం మారిపోయింది.
చింతామణి, భవానీ శంకర్, బిల్వమంగళుడు ప్రధాన పాత్రలుగా మొదలైన ఈ నాటకం అంతిమంగా చింతామణి, సుబ్బిశెట్టి, శ్రీహరి, కొంతమేరకు చిత్ర, ప్రధాన పాత్రలుగా రూపాంతరం చెందింది.
ఒకానొక దశలో సుబ్బిశెట్టి, చింతామణి, చిత్ర పాత్రలతోనే నాటకం నడిపించడం మొదలైంది. ఈ దశలోనే చింతామణి, చిత్ర పాత్రల సంగతి ఎలా ఉన్నా సుబ్బిశెట్టి పాత్రను ఆర్యవైశ్య కులానికి ఆపాదించడం, ఆ కులాన్ని గేలిచేయడం ఎక్కువైంది.
మొదట ఆశించిన సామాజిక నీతి ఎగిరి పోయింది. ఆ తర్వాత మొదలుపెట్టిన హాస్యం మరుగున పడింది. చివరికి చింతామణి నాటకం అంటే సుబ్బిశెట్టి పాత్ర అని, సుబ్బిశెట్టి అంటే ఒక కులం అని ఆలోచించే పరిస్థితి.
గ్రామం అంతా కుటుంబసమేతంగా చూసి ఆనందించే నాటకం శృంగారం పాళ్ళు పెంచడంతో మహిళా ప్రేక్షకుల్ని, హాస్యం పేరుతో వెకిలితనం పెంచడంతో మిగతా ప్రేక్షకుల్ని కోల్పోయింది. అంతిమంగా చింతామణి నాటకం అంటే ఓ కులాన్ని అవహేళన చేసే కథావస్తుగా మిగిలిపోయింది.
కథానాయిక చింతామణి తన ఉనికిని కోల్పోయి, సుబ్బిశెట్టి పాత్రకు మొత్తం నాటకాన్ని అంటగట్టింది.
ఈ నాటకం, చాలా నాటకాల్లాగానే గొప్ప సాంఘిక నాటకం. కళాకారులు ఈ తప్పులు సవరించుకుంటే నాటకాన్ని బ్రతికించుకోవచ్చు. చింతామణి కథానాయకి. భవానీ శంకర్, బిల్వమంగళుడు కథానాయకులు. వ్యసనాలకు బానిసలై ఆస్తిపాస్తులు పోగొట్టుకుని బికారులు కావొద్దని, సంసారం జీవితం కోల్పోయి దిక్కులేనివారు కావొద్దని ఈ నాటకం నేర్పే నీతి. ఈ అంశాలకు పరిమితమైతే నాటకం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.
సుబ్బిశెట్టి ఆర్యవైశ్య కులానికి ప్రతినిధి అయితే, భవానీ శంకర్ బ్రాహ్మణకులానికి ప్రతినిధి. బిల్వమంగళుడు ఆర్ధికంగా, సామాజికంగా మెరుగైన స్థాయిలో ఉన్న ఇతర కులాల ప్రతినిధి. అందరూ నష్టపోయిన వాళ్ళే. సుబ్బిశెట్టి ప్రత్యేకం కాదు.
కళలు అంతరించిపోతున్న మాట వాస్తవమే కానీ, వాటిని కొనఊపిరితో అయినా బ్రతికుండనిస్తే మంచిది.
Facebook post by Gopi Dara