విశాఖను రాజధాని కాదని ఎవరన్నారు, విశాఖ ఏపీలోనే అతి పెద్ద సిటీ. హైదరాబాద్ తరువాత ఉమ్మడి ఏపీలో రెండవ సిటీగా ఉంది. ఇక విశాఖను ఐటీ రాజధానిగా చేద్దామని నాటి సీఎం వైఎస్సార్ అప్పట్లోనే గట్టిగానే సంకల్పించారు. ఆయన హయాంలో విశాఖ రుషికొండ వాలీలో ఐటీ క్యాంపస్ ఏర్పాటైంది.
ఇపుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రోత్సాహంతో కృషితో విశాఖ ఐటీ రాజధానిగా మరింతగా రాణించనుంది. ఆదాని గ్రూప్ విశాఖలో డేటా సెంటర్ పార్క్ ని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన పనులు విశాఖలో చురుకుగా సాగుతున్నాయి.
బిజినెస్ పార్క్, ఐటీ సంస్థ, స్కిల్ యూనివర్శిటీ, రిక్రియేషన్ సెంటర్లు అన్నీ కూడా విశాఖలో రాబోతున్నాయి. వీటి వల్ల పెద్ద ఎత్తున ఉపాధి ఐటీ పరంగా విశాఖకు లభించే అవకాశాలు ఉన్నాయి.
దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 130 ఎకరాలను కేటాయించింది. 14,634 కోట్లతో 82 ఎకరాల్లో డేటా సెంటర్ పార్క్, 11 ఎకరాల్లో స్కిల్ యూనివర్శిటీ, తొమ్మిది ఎకరాల్లో రిక్రియేషన్ కేంద్రం వంటివి ఏర్పాటు అవుతాయి. తొందరలోనే వీటికి శ్రీకారం చుడతారు.
మరో వైపు చూస్తే 15వ ఆర్ధిక సంఘం విశాఖను ఆర్ధిక రాజధాని చేయడానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం 1400 కోట్ల రూపాయలను మంజూరు చేయనుంది. మొత్తానికి విశాఖ ఏ విధంగా చూసినా రాజధానే అంటున్నారు. దాన్ని ఎవరు కాదనగలరు అని కూడా నగర వాసులు అంటున్నారు.