స‌మైక్య ఉద్య‌మాన్ని తాక‌ట్టు పెట్టిన అశోక్‌బాబు

ఏపీ ఎన్జీవో మాజీ అధ్య‌క్షుడు, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు నిన్న టీవీ9 డిబేట్‌లో నోరు జార‌డంతో చిక్కులొచ్చాయి. 2014లో టీడీపీ అధికారంలోకి రావ‌డానికి తానే కార‌ణ‌మ‌ని, ఈ విష‌య‌మై కావాలంటే చంద్ర‌బాబును అడ‌గాల‌ని అశోక్‌బాబు…

ఏపీ ఎన్జీవో మాజీ అధ్య‌క్షుడు, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు నిన్న టీవీ9 డిబేట్‌లో నోరు జార‌డంతో చిక్కులొచ్చాయి. 2014లో టీడీపీ అధికారంలోకి రావ‌డానికి తానే కార‌ణ‌మ‌ని, ఈ విష‌య‌మై కావాలంటే చంద్ర‌బాబును అడ‌గాల‌ని అశోక్‌బాబు అన్నాడు. ఈ మాట‌ల‌పై ఏపీఎన్జీవో, ఏపీ అమ‌రావ‌తి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. మాట జాగ్ర‌త్త అంటూ ఆ సంఘాల అధ్య‌క్షులు తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు.

2014లో టీడీపీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేశామ‌ని అశోక్‌బాబు చెప్పిన‌వ‌న్నీ ప‌చ్చి అబ‌ద్ధాల‌ని ఏపీ ఎన్జీవో అధ్య‌క్షుడు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు. తామెప్పుడూ టీడీపీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయ‌లేద‌న్నారు. అశోక్‌బాబు వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ఖండించారు.  అశోక్‌బాబు తనను ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా కాకుండా అడ్డుకోవాలని చూశారని, చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నవారిని ఏపీఎన్జీవో  అధ్యక్షుడిగా చేయాలని చూశారని ధ్వజమెత్తారు.

‘అశోక్‌బాబు మమ్మల్ని రాజకీయంగా వేధించారు. ఇంకోసారి ఆయన ఏపీఎన్జీవో  పేరు ఎత్తితే సహించేదిలేదని’  చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. మాట‌లు జాగ్ర‌త్త‌గా మాట్లాడాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. ఏపీఎన్జీవో సంఘానికి అశోక్‌బాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

టీడీపీకి మద్దతు తెలిపామని అశోక్‌బాబు మాట్లాడటం సిగ్గుచేటని ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు.  సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టిన ఘనుడు అశోక్‌బాబు అని ఆయ‌న తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. అలాగే త‌హ‌శీల్దార్‌ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే ఒక మాటైనా మాట్లాడావా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవి కోసం ఉద్యోగుల హక్కులను చంద్రబాబుకు  అశోక్‌బాబు తాక‌ట్టు పెట్టార‌న్నారు.  

ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ పదవిని అశోక్ బాబు సంపాదించారని,  వెంటనే ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. అశోక్ బాబు పై రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.  సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా అశోక్ బాబు కు వచ్చిన నిధులుపై కూడా విచారణ జరపాలని సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు.

మరో 30ఏళ్ళు నువ్వే ఉండాలన్నా

చైనాకి బుద్ధి చెబుదాం