గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసులకు సీఐ స్థాయి వరకు పదోన్నతి వచ్చే అవకాశముందనేది ప్రభుత్వ అనుకూల మీడియాలో వచ్చిన ప్రత్యేక కథనం. మహిళా, శిశు సంరక్షణ కార్యదర్శి పేరుతో మొదలైన ఈ ఉద్యోగాలను మహిళా పోలీసులుగా మార్చి, వారికి ఖాకీ దుస్తులు ఇచ్చి, వారిని పోలీస్ విభాగంలో చేర్చే విషయంలోనే ఇప్పటి వరకూ స్పష్టత లేదు. కోర్టు కొర్రీతో ఆ వ్యవహారం అసంపూర్తిగా ఉంది. ఇప్పుడిలాంటి ప్రచారాలు అవసరమా..? మహిళా పోలీసులకు సీఐ పదోన్నతి అనేది మరీ అసందర్భం అనిపించడం లేదా..?
పోలీసులకు అవసరమైన ఫిజికల్ టెస్టులేవీ పాస్ కాకుండానే, అసలా అర్హతలు లేకుండానే మహిళా, శిశు సంరక్షణ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేశారు. ఆ తర్వాత పోలీస్ విభాగంలో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో వారిని స్థానిక పోలీస్ స్టేషన్లకు అటాచ్ చేశారు. మహిళా పోలీసులుగా పేరు కూడా మార్చేశారు. పోలీస్ బందోబస్తు డ్యూటీలు, కొవిడ్ డ్యూటీలకు కూడా వీరిని ఉపయోగించుకున్నారు.
ఈ క్రమంలో వీరికి పోలీస్ యూనిఫామ్ ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. రీసెంట్ గా స్థానిక సివిల్ వివాదాలను పరిష్కరించే బాధ్యత మహిళా పోలీస్ లకు అప్పగించాలనే ప్రయత్నాన్ని కోర్టు అడ్డుకోవడంతో ఆగిపోయింది. ఇప్పుడు వీరిని సచివాలయ సిబ్బందిగా ఉంచాలా, పోలీస్ విభాగంలో కలిపేయాలా అనే చర్చ నడుస్తోంది.
ఈ క్రమంలో మహిళా పోలీస్ లకు ప్రభుత్వం శుభవార్త చెప్పాలనుకుంటోంది. పోలీస్ శాఖలో ప్రత్యేక వ్యవస్థగా వీరిని ఏర్పాటు చేసేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని చూస్తున్నారు. మొత్తం 15వేలమంది మహిళా కానిస్టేబుళ్లకు ఈ బిల్లు ద్వారా లబ్ధి చేకూరుతుంది. అయితే జీతాలు, సెలవులు మాత్రం స్థానిక మున్సిపాల్టీలు, పంచాయితీ పరిధిలోనే ఉంటాయని చెప్పడం విశేషం. మహిళా పోలీసులంటారు, లాఠీ ఇస్తామంటారు, ఖాకీ యూనిఫామ్ ఇస్తామంటారు, పని చేయించుకుంటారు, జీతం మాత్రం సచివాలయంలో తీసుకోవాలంటారు.. ఇదెక్కడి గందరగోళం. దీనిపై ఇంకా సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
ఈలోగా గ్రామ, వార్డు మహిళా పోలీస్ లకు సీఐ వరకు పదోన్నతి అనే అంశాన్ని తెరపైకి తెస్తూ కథనాలిస్తున్నారు. డిగ్రీ చదివిన మహిళా పోలీసులు ఇలాంటి కథనాలపై లేనిపోని ఆశలు పెట్టుకుంటారు. కచ్చితంగా వారికి ఇది సంతోషాన్నిచ్చే వార్తలే. కానీ వాస్తవ రూపం దాలుస్తాయా లేదా అనేది ప్రచురణకర్తలు ఆలోచించాలి.
అత్యుత్సాహపు కథనాలు, వారిలో లేనిపోని సంతోషాన్ని కలిగిస్తాయి, ఆ తర్వాత వాటికి కోర్టు వేసే కొర్రీలు ప్రభుత్వానికి తలనొప్పి తెస్తాయి. ఉద్యోగాల కల్పన, క్రమబద్ధీకరణ విషయంలో ఇలాంటి అత్యుత్సాహపు కథనాలతోనే అనర్థాలు జరిగే అవకాశాలుంటాయి. ఆ తర్వాత ప్రభుత్వం వివరణ ఇచ్చుకోలేక సతమతం అవ్వాల్సి ఉంటుంది.