కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో విచిత్రం చోటు చేసుకుంది. ఈ మున్సిపాలిటీలో 25 వార్డులుండగా, ఒక వార్డు ఏకగ్రీవమైంది. మిగిలిన 24 వార్డుల్లో ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఇవాళ మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడానికి ఎన్నికల అధికారులు సమాయత్తమయ్యారు.
మొత్తం మూడు పోస్టల్ బ్యాలెట్లను గుర్తించారు. కానీ ఏ ఒక్కరూ ఏ ఒక్క పార్టీకి ఓటు వేయకపోవడం చూసి కౌంటింగ్ అధికారులు ఆశ్చర్యపోయారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పించే విషయం తెలిసిందే.
కేవలం ముగ్గురు మాత్రమే పోస్టల్ బ్యాలెట్లను సంబంధిత బాక్సుల్లో వేశారు. అయితే ఓటు మాత్రం వేయకపోవడంతో రాజకీయ పార్టీలు ఖంగుతిన్నాయి. కరవమంటే కప్పకు , విడవమంటే పాముకు కోపం అనే చందాన…అనవసరంగా రాజకీయ పార్టీల ఆగ్రహానికి తామెందుకు గురి కావాలనే తలంపుతో ఉద్యోగులు అసలు ఓటే వేయలేదు.
చాలా మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించకపోవడం కూడా కుప్పం ఎన్నికల ప్రత్యేకతగా భావించాలి.