హైకోర్టులో అనుకూల వ్యాఖ్య‌లు వైసీపీకి ప‌ట్ట‌వా?

కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికీ త‌మ ప్ర‌భుత్వానికి హైకోర్టు వ్య‌తిరేక‌మనే బ‌ల‌మైన అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో నాటుకుపోయింది. డాక్ట‌ర్ సుధాక‌ర్ కేసును సీబీఐ ద‌ర్యాప్తునకు ఆదేశించ‌డం, అలాగే మ‌రికొన్ని తీర్పుల విష‌యంలో వైసీపీ శ్రేణులు నొచ్చుకున్న మాట…

కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికీ త‌మ ప్ర‌భుత్వానికి హైకోర్టు వ్య‌తిరేక‌మనే బ‌ల‌మైన అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో నాటుకుపోయింది. డాక్ట‌ర్ సుధాక‌ర్ కేసును సీబీఐ ద‌ర్యాప్తునకు ఆదేశించ‌డం, అలాగే మ‌రికొన్ని తీర్పుల విష‌యంలో వైసీపీ శ్రేణులు నొచ్చుకున్న మాట వాస్త‌వం. 

ఈ సంద‌ర్భంగా వారి ఆగ్ర‌హం హ‌ద్దులు దాటి హైకోర్టు న్యాయ‌మూర్తుల‌పై సోష‌ల్ మీడియాలో తిట్ల దండకానికి దారి తీసింది. ఈ వ్య‌వ‌హారాన్ని హైకోర్టు సీరియ‌న్ తీసుకుని… ఇటీవ‌ల సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఆదేశించిన విష‌యం తెలిసిందే.

అయితే త‌మ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక కామెంట్స్‌, తీర్పులు వ‌చ్చిన‌ప్పుడు సీరియ‌స్‌గా రియాక్ట్ అవుతున్న వైసీపీ శ్రేణులు, సోష‌ల్ మీడియా ….ఇదే సంద‌ర్భంలో త‌మ‌కు అనుకూల వాతావ‌ర‌ణం చోటు చేసుకున్న‌ప్పుడు ప్ర‌శంసించాలి క‌దా? ఆ ప‌ని ఎందుకు చేయ‌డం లేదు. 

రెండు రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణానికి ముగింపు ప‌లికేందుకు దీన్ని అవ‌కాశంగా ఎందుకు తీసుకోకూడ‌ద‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు నిన్న మూడు వేర్వేరు కేసుల‌కు సంబంధించి హైకోర్టు న్యాయ‌మూర్తులు సంధించిన ప్ర‌శ్న‌లు, ప్ర‌శంస‌ల‌ను త‌ప్ప‌క ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. 

అభిప్రాయ భేదాలు త‌లెత్తిన‌ప్పుడు ప‌ర‌స్ప‌రం చ‌ర్చించుకోవ‌డం ద్వారా అనుమానాలను పార‌దోల‌వ‌చ్చు. ఇప్పుడు హైకోర్టు, రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్య ఓ సానుకూల వాతావ‌ర‌ణానికి బీజం ప‌డింది. వాటికి ఇప్పుడు చెప్ప‌బోయే అంశాలే నిద‌ర్శ‌నం.

వైఎస్సార్ చేయూత కింద ల‌బ్ధి పొందేందుకు తాము అన్ని ర‌కాలుగా అర్హులైన‌ప్ప‌టికీ, అధికారుల త‌ప్పిదం వ‌ల్ల ఫ‌లాలు అంద‌లేదంటూ  కృష్ణా జిల్లా చంద‌ర్ల‌పాడుకు చెందిన 20 మంది హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌లో భాగంగా  హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్ జ‌గ‌న్ స‌ర్కార్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే…

“రాష్ట్ర ప్ర‌భుత్వం ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌ల అభ్యున్న‌తి కోసం , ఆర్థిక సాధికార‌త కోసం ఎన్నో మంచి ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంది. వారి జీవ‌న ప్ర‌మాణాల‌ను , జీవ‌న స్థితిగ‌తుల‌ను మార్చేందుకు తీసుకొచ్చిన ఆ ప‌థ‌కాల అమ‌లు వెనుక ఎంతో ప్ర‌శంస‌నీయ‌మైన ఉద్దేశం ఉంది. అయితే ఇంత మంచి ప‌థ‌కాల ఫ‌లాలు కొంద‌రు అధికారుల వ‌ల్ల అందాల్సిన వారికి అంద‌క‌పోవ‌డంతో ఇబ్బందులు ప‌డుతున్నారు” అని వ్యాఖ్యానించారు. 

త‌మ‌కు వ్య‌తిరేక‌మ‌నే భావిస్తున్న ఓ రాజ్యాంగ వ్య‌వ‌స్థ నుంచి ప్ర‌శంస‌లు రావ‌డం కంటే ఆనందం మ‌రేదైనా ఉందా?

అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌టిన మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారంపై ప్ర‌స్తుతం హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ జితేంద్ర‌కుమార్ మ‌హేశ్వ‌రి, న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ మ‌ల్ల‌వోలు స‌త్య‌నారాయ‌ణ‌, జ‌స్టిస్ నైనాల జ‌య‌సూర్య‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచారిస్తోంది. 

మూడు రాజ‌ధానుల ఏర్పాటు వెనుక ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు దురుద్దేశాలున్నాయ‌ని న్యాయ‌వాది వాదించ‌డంపై ధ‌ర్మాసనం స్పంద‌న ఏంటో చూద్దాం.

“అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని మార్చ‌డం  వెనుక దురుద్దేశాలున్నాయ‌ని ఎలా చెబుతారు? ముఖ్య‌మంత్రి ఫ‌లానా హామీ ఇచ్చి ఉల్లంఘించార‌ని చెబుతున్నార‌ని, అది ఎలా దురుద్దేశం అవుతుంది?  సీఎం తీరు గురించి చెప్ప‌డం, దురుద్దేశాలు ఆపాదించ‌డం వేర్వేరు. 

దురుద్దేశాలున్నాయంటే అందుకు నిర్దిష్ట‌మైన వివ‌ర‌ణ‌, కార‌ణాలు తెలియ‌జేయాల్సి ఉంటుంది. ఊరికే దురుద్దేశాలున్నాయ‌ని చెబితే స‌రిపోదు. అలాగే రాజ‌ధాని ఒక చోట‌, హైకోర్టు మ‌రోచోట ఉన్న న‌గ‌రాలు ఎన్నో ఉన్నాయి. అందువ‌ల్ల హైకోర్టును అమ‌రావ‌తిలో కాకుండా మ‌రోచోట ఏర్పాటు చేయ‌డం త‌ప్పెలా అవుతుంది?”

అలాగే మ‌రో కేసు విచార‌ణ‌ను కూడా స్ట‌డీ చేద్దాం. రాష్ట్రంలో పంచాయ‌తీ భ‌వ‌నాల‌కు అధికార పార్టీ రంగులు వేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.4 వేలు కోట్లు ఖ‌ర్చు చేసింద‌ని, ఈ మొత్తాన్ని మంత్రులు, అధికారుల నుంచి వ‌సూలు చేయాలంటూ గుంటూరుకు చెందిన డాక్ట‌ర్ మ‌ద్దిపాటి శైల‌జ   ప్ర‌జావ్యాజ్యం (పిల్‌) దాఖ‌లు చేశారు. 

ఈ వ్యాజ్యంపై  విచార‌ణ‌లో భాగంగా హైకోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ చాగ‌రి ప్ర‌వీణ్‌కుమార్‌, జ‌స్టిస్ దొనాడి ర‌మేశ్‌ల‌తో కూడిన ధ‌ర్మాసనం పిటిష‌న‌ర్‌కు కొన్ని ప్ర‌శ్న‌లు సంధించింది.

“రాష్టంలో పంచాయ‌తీ భ‌వ‌నాల‌కు రంగులు వేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.4 వేల కోట్లు ఖ‌ర్చు చేసింద‌నే లెక్క‌కు ప్రామాణికం ఏమిటి? మీరు చెబుతున్న‌ది నిజ‌మే అనుకున్నా … ఒక్కో కార్యాల‌యానికి రూ.4 వేలు వేసుకున్నా , 10 వేల కార్యాల‌యాల‌కు రూ.4 వేల కోట్లు కాదు. అలాంట‌ప్పుడు ఈ లెక్క‌లు దేని ఆధారంగా వేశారు. 

ఊహాజ‌నితంగా వేసిన లెక్క‌ల‌ను, వాటి ఆధారంగా వేసిన వ్యాజ్యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేం. మంత్రుల‌ను, అధికారుల‌ను వ్య‌క్తిగ‌త హోదాలో ప్ర‌తివాదులుగా చేర్చ‌డం ఏంటి?” అని ప్ర‌శ్న‌ల‌తో పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాదిని హైకోర్టు ధ‌ర్మాస‌నం ఉక్కిరిబిక్కిరి చేసింది.

కాలం ఎప్పుడూ ఒకే ర‌కంగా ఉండ‌దు. అమావాస్య‌, పున్న‌మి ఉంటాయి. అయితే పున్న‌మి వెలుగులో కూడా చీక‌టిని త‌ల‌చుకుంటూ ఉంటే …అంధ‌కారంలోనే మగ్గాల్సి ఉంటుంది. పున్న‌మి వెన్నెల‌ను ఆస్వాదించ‌డానికి మ‌న‌సును సిద్ధం చేసుకోవాలి. 

ఇప్పుడీ మాట వైసీపీ శ్రేణుల‌కు వ‌ర్తిస్తుంది. పైన పేర్కొన్న ఉదాహ‌ర‌ణ‌లే కాకుండా, ఇటీవ‌ల స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో వెల్ల‌డైన తీర్పులు కూడా జ‌గ‌న్ స‌ర్కార్‌కు సానుకూలంగా ఉన్న విష‌యాన్ని గ‌మ‌నంలో పెట్టుకోవాలి. కోప‌తాపాలు శాశ్వ‌తం కాద‌ని గ్ర‌హించాలి.

ఒక రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లో వ‌చ్చిన మార్పున‌కు అనుగుణంగా మ‌న వైపు నుంచి కూడా అదే ర‌క‌మైన స్పంద‌న రావాలి. విధానాలు, భావాల సంఘ‌ర్ష‌ణే త‌ప్ప వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌కు తావులేదని గుర్తిస్తే, అన్నిటికి ప‌రిష్కారం దొరుకుతుంది. 

పేపర్లు విసిరేసిన తమ్మినేని