విశాఖను గత ఏడాది సరిగ్గా ఇదే సమయంలో పాలనా రాజధానిగా జగన్ ప్రతిపాదించారు. ఆ తరువాత రాజకీయ పరిణామాలు చకచకా సాగిపోయాయి. జగన్ తీసుకున్న నిర్ణయం చట్ట రూపం దాల్చడానికి ఆరు నెలల సమయం పట్టింది.
ఇక మంచి ముహూర్తం చూసి విశాఖకు రాజధానిని తరలిద్దామనుకున్న వేళ కోర్టులో కేసులు పడ్డాయి. ఇపుడు కోర్టులో రోజు వారీ విచారణ జరుగుతోంది. మరో వైపు చూస్తే విశాఖకు రాజధాని హంగులు తెచ్చిపెట్టేందుకు వైసీపీ సర్కార్ చేయాల్సినవన్నీ చేస్తోంది.
తాజాగా స్కిల్ యూనివర్శిటీని కూడా విశాఖకు జగన్ మంజూరు చేశారు. ఐటీ రాజధానిగా ఉన్న విశాఖకు ఇది అదనపు ఆభరణం.ఇక విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది.
దాని కోసం వేల కోట్లతో ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నారు.ఇవన్నీ ఇక ఎత్తు అయితే విశాఖకు ఎపుడు రమ్మనా తరలివచ్చేందుకు మేము రెడీ అంటూ ఉద్యోగ సంఘాలు ప్రకటించడం హర్షణీయమైన పరిణామంగా చూడాలి.
ప్రభుత్వం ఎపుడు పిలిస్తే అపుడూ తామంతా కట్టకట్టుకుని విశాఖలో వాలిపోతామని ఏపీ ఎంజీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి చెప్పడం శుభ పరిణామమే. మరి కొత్త ఏడాది విశాఖకు మంచి రోజులు వస్తాయని అంతా అంటున్నారు.