వేమూరి రాధాకృష్ణ నేతృత్వంలో నడిచే ఆంధ్రజ్యోతి పత్రికను రాజగురువు రామోజీరావు సారథ్యంలో నడిచే ఈనాడు పత్రిక మోసగించింది. ఎల్లో పత్రికలుగా చెలామణి అవుతున్న ఆ రెండు పత్రికల్లో వార్తల ప్రాధాన్యం, అలాగే వార్తల విస్మరణ అంతా కూడబలుక్కున్నట్టు జరుగుతుంది. అంతెందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖకు ఆ రెండు పత్రికల్లో స్థానం దక్కలేదు. కానీ ఆ ఫిర్యాదుపై కౌంటర్లకు మాత్రం ఎక్కడా లేని ప్రాధాన్యం లభిస్తోంది.
అలాంటి కౌంటర్ వార్తకు ఈనాడులో బ్యానర్ కట్టగా, ఆంధ్రజ్యోతి మాత్రం మిస్ కావడం ఆశ్యర్యంగా ఉంది. ఈ వార్త విషయంలో ఆంధ్రజ్యోతిని ఈనాడు మోసం చేసిందనే సెటైర్లు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. ఈనాడులో ‘న్యాయ వ్యవస్థపై దాడిని చూస్తూ ఊరుకోవద్దు’ శీర్షికతో ఓ మహాద్భుత వార్తను క్యారీ చేశారు. ప్చ్ …ఈ వార్త విషయంలో ముమ్మాటికీ ఆంధ్రజ్యోతికి ఇవ్వకుండా ఎన్టీఆర్ భవన్ వంచించిందనే చెప్పొచ్చు.
జగన్ లాంటి వారిని ఉపేక్షిస్తే న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు విఘాతం కలుగుతుందని, కావున కఠిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు సీజేకు 100 మంది న్యాయ శాస్త్ర విద్యార్థుల లేఖ రాసిన కథనాన్ని ఈనాడు మాత్రమే క్యారీ చేసింది. ఊరూ, పేరూ లేని న్యాయశాస్త్ర విద్యార్థులు రాసిన లేఖ మాత్రం చాలా ఘాటుగా ఉంది.
భారత న్యాయ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాడి చేస్తున్నారని, నిరంకుశత్వం, ప్రతీకారేచ్ఛ ధోరణితో కూడిన ఈ దాడి ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టని దేశంలోని వివిధ న్యాయ కళాశాలలకు చెందిన 100 మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ తీరును మొత్తంగా న్యాయ వ్యవస్థపై చేసిన దాడిగా భావించి , కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేకి లేఖ రాశారు.
న్యాయమూర్తులపై దాడిని ఉపేక్షిస్తే న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు విఘాతం కలుగుతుందని, ఆ పరిస్థితి రానీయొద్దని న్యాయ శాస్త్ర విద్యార్థులు కోరారు.
‘మేం దేశంలోని వివిధ న్యాయశాస్త్ర కళాశాలలకు చెందిన విద్యార్థులం. ప్రజాస్వామ్య మూలస్తంభాలను కాపాడటానికి న్యాయ వ్యవస్థ స్వతంత్రత చాలా ముఖ్యమని తరగతి గదుల్లో మాకు బోధించారు. పౌరుల ప్రాథమిక హక్కులను సంరక్షించి కాపాడేది న్యాయ వ్యవస్థేనని , ప్రజా విశ్వాసమే దానికి పునాది అని స్పష్టం చేశారు’
మరి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు లేఖ రాయడం న్యాయ వ్యవస్థపై దాడిగా తాము చదువుకున్న ఏ పుస్తకంలో, ఏ పేజీలో ఉందో సదరు ఊరూ, పేరూ లేని విద్యార్థులు చెబితే తెలుసుకుని జనం తరిస్తారు. అయినా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు దేశ వ్యాప్తంగా 100 మంది విద్యార్థులు లేఖ రాస్తున్నప్పుడు, ఏఏ ప్రాంతం నుంచి ఎవరెవరు అనే వివరాలేవీ పొందుపరచకుండా ఆకతాయిలు రాసే ఆకాశ రామన్న ఉత్తరాల్లా ఏంటీ పని?
‘రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను సజీవంగా ఉంచాలంటే న్యాయ వ్యవస్థకు స్వతంత్రత అతి ముఖ్యం. స్వతంత్ర కోర్టులు లేకుంటే , ప్రాథమిక హక్కులను ప్రసాదించే రాజ్యాంగ భాగాలను రద్దు చేసే ప్రమాదం ఉంది అని జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా చేసిన వ్యాఖ్యలతో తమ లేఖను ముగిస్తున్నాం’ అని న్యాయశాస్త్ర విద్యార్థులు పేర్కొన్నారు.
మరి రాజ్యాంగం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు హక్కులు కల్పించిందా? లేదా? కేవలం న్యాయశాస్త్ర విద్యార్థులకు, ఆ రంగంలోని వాళ్లకు మాత్రమే ప్రత్యేక రాజ్యాంగం, హక్కులు, బాధ్యతలు కల్పించిందా? జగన్‌కు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులేవైనా ఉన్నాయని న్యాయశాస్త్ర విద్యార్థులుగా భావిస్తుంటే… వాటిని కాపాడాల్సిన బాధ్యత న్యాయశాస్త్ర విద్యార్థులుగా మీపై లేదా? అలాంటి పని చేయకుండా ఫిర్యాదు చేయడమే నేరమన్నట్టు కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయడం అంటే మీరు చివరిగా జస్టిస్ ఖన్నా చెప్పిన మాటలతో ముగించడంలో అర్థం ఏముంది?
ఇదేనా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను సజీవంగా ఉంచడం? అసలు ఏపీ హైకోర్టు స్వతంత్రంగా వ్యవహరించలేదనేదే కదా ముఖ్యమంత్రి ఆవేదన! ఆయన ఆరోపణలపై విచారణ జరపకుండా, తాము అన్నిటికీ అతీతమన్నట్టు వ్యవహరించడం వల్ల చివరికి ఏం సాధిస్తారో న్యాయ శాస్త్ర విద్యార్థులే ఆలోచించాలి. ఆ విషయమై ప్రజలకు సమాధానం చెప్పాలి.