సీఎం గా పవన్ అంటే…?

ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చిందే ఏనుగు కుంభస్థలం బద్ధలు కొట్టడానికే. పవన్ లాంటి చరిష్మాటిక్ సినీ హీరో పార్టీ పెట్టింది కూడా ఎపుడూ పొత్తులతోనో, జట్టులతోనో కాలక్షేపం చేయడానికి కాదు, పవన్ కోరుకున్నది సీఎం సీటే.…

ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చిందే ఏనుగు కుంభస్థలం బద్ధలు కొట్టడానికే. పవన్ లాంటి చరిష్మాటిక్ సినీ హీరో పార్టీ పెట్టింది కూడా ఎపుడూ పొత్తులతోనో, జట్టులతోనో కాలక్షేపం చేయడానికి కాదు, పవన్ కోరుకున్నది సీఎం సీటే. అది ఆయన కూడా 2019 ఎన్నికల వేళ చాలా సార్లు చెప్పారు, ఇక జనసైనికులు అయితే సీఎం సీఎం అంటూ పవన్ సభల్లో తరచూ  నినాదాలు చేస్తూంటారు.

మరి ఈ సంగతులు ఏవీ తెలుగు తమ్ముళ్లకు తెలియవు అనుకోగలమా. అంతకంటే కూడా నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ అనుభవం గడించిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి తెలియదు అంటే నమ్మగలమా. 

అయితే అయ్యన్న మాత్రం జనసేనతో పొత్తులు కావాలి, సీఎం గా మాత్రం మా బాబే ఉండాలి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. దీని మీద ఆయన తాజాగా ఒక చానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో పొత్తు ఉండాలనే తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాట్లుగా చెప్పారు. అయితే సీఎం పదవి విషయంలో ఎలా సర్దుబాటు కుదురుతుంది అన్న ప్రశ్నకు ఆయన జవాబు కూడా తేలికగానే ఇచ్చేశారు.

ఏముంది 2019 ఎన్నికల్లో మాకు ఎంత ఓట్ల శాతం వచ్చిందో, జనసేనకు ఎంత వచ్చిందో పక్కాగా రికార్డులు ఉన్నాయిగా. దాని ప్రకారమే సర్దుబాట్లు ఉంటాయి. ఇక టీడీపీ నాలుగు దశాబ్దాల పార్టీ అంటూ తామే పెద్దన్న అన్నట్లుగా కలరింగ్ ఇచ్చారు. 

అంటే 2019లో జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి టీడీపీతో పొత్తు పెట్టుకున్నా పవన్ కి సీఎం అయ్యే చాన్స్ ఇవ్వబోమని అయ్యన్న చెప్పారనుకోవాలి. అలాగే అదే ఓట్ల శాతాన్ని బట్టే సీట్లు కూడా అన్నే ఇస్తామని చెప్పారనుకోవాలి. మరి ఈ రెండున్నరేళ్లలో టీడీపీ కూడా బాగా ఓట్ల షేర్ తగ్గించుకుంది. అదే టైమ్ లో జనసేన కూడా హడావుడి పెంచింది.

మరి దీని ప్రకారం జనాల్లో తమకే బలం ఉంది, తామే సీఎం అభ్యర్ధి అని పవన్ అంటే టీడీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో. ఏది ఏమైనా పవన్ తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలన్న ఆలోచన తప్ప ఆయనను ఒక్కసారి అయినా సీఎం ని చేసి ఆ సామాజికవర్గం ఆకాంక్షను తీర్చాలన్న ధ్యాస అయితే టీడీపీకి లేదనే అనుకోవాలి. 

మరి ఇది తన వ్యక్తిగతమని అయ్యన్న చెబుతున్నా కాబోయే సీఎం మేమే, వచ్చే ఎన్నికల్లో టీడీపీయే పవర్ లోకి వస్తోంది అంటూ బాబు చెబుతున్న దాన్ని బట్టి చూసినా కొత్త మిత్రులుగా టీడీపీతో ఎవరు జట్టు కట్టినా వారు పక్క వాయిద్యాలే అని ఆ పార్టీ  పెద్దలు చెప్పకనే చెబుతున్నారనుకోవాలేమో.