ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 14న తిరుపతిలో తలపెట్టిన ప్రచార పర్యటన రద్దు అయ్యింది. ఈ మేరకు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ఎన్నికల ప్రచారానికి రాలేకపోతున్నట్టు జగన్ తన లేఖలో స్పష్టం చేశారు.
డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలని కోరుతూ జగన్ ఆత్మీయ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం ఏంటో చూద్దాం.
‘ నిన్న ఒక్కరోజే 2,765 కరోనా కేసులు వచ్చాయి. చిత్తూరులో 496, నెల్లూరులో 296 కేసులు వచ్చాయి. 24 గంటల వ్యవధిలో ఈ రెండు జిల్లాల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. తిరుపతి సభకు నేను హాజరైతే వేలాదిగా జనం తరలి వస్తారు. ప్రజల ఆరోగ్యం, ఆనందం నాకు ముఖ్యం. బాధ్యత కలిగిన సీఎంగా తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నా. ప్రతి కుటుంబానికి కలిగిన లబ్ధికి సంబం ధించిన వివరాలతో.. నా సంతకంతో ఇంటింటికి అందేలా ఉత్తరం రాశా.
మీ అందరి కుటుంబాల శ్రేయస్సు దృష్ట్యా నేను రాలేకపోయినా.. 22 నెలల్లో మీకు చేసిన మంచి మీ అందరికీ చేరిందన్న నమ్మకం నాకుంది.. గతంలో వచ్చిన 2.28 లక్షల మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీతో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలి. డాక్టర్ గురుమూర్తికి ఓటు వేయాలని రాసిన ఉత్తరం మీకు చేరిందని భావిస్తున్నా. డాక్టర్ గురుమూర్తిని తిరుగులేని మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. మీ అందరి చల్లని దీవెనలు ఓటు రూపంలో ఇస్తారని భావిస్తున్నా’ అని లేఖలో సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
ఎన్నికల ఒక్కరోజు ప్రచారానికి జగన్ వస్తున్నారంటే…ఓటమి భయంతోనే తిరుపతి బాట పట్టారని ప్రతిపక్షాలు విమర్శించాయి. తాజాగా జగన్ పర్యటన రద్దు అయిన నేపథ్యంలో ప్రతిపక్షాలు జగన్‌పై విమర్శలు గుప్పించడానికి ఏ లైన్ తీసుకుంటాయో చూడాల్సిందే. మొత్తానికి కోవిడ్ విజృంభిస్తున్న ప్రమాదకర పరిస్థితుల్లో తన పర్యటన రద్దు చేసుకుని జగన్ మంచి పని చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.