తెలుగువారి సంవత్సరాది ఉగాది నాటికి పరిపాలనా రాజధాని విశాఖకు మార్చాలని, అక్కడినుంచే పాలన సాగించాలనేది జగన్ కల. హైకోర్టు తరలింపు వ్యవహారం జరిగినా జరక్కపోయినా, పాలనా రాజధానిని మాత్రం ఉగాది మహూర్తానికి విశాఖకు మార్చేయాలనేది జగన్ ఆశ. కానీ ఆ ఆశ నెరవేరేలా లేదు. దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి.
1. విశాఖ ఇంకా రెడీ కాలేదు.. విశాఖలో రాజధాని తరలింపుకి సంబంధించి ఎలాంటి పనులు ఊపందుకోలేదు. కాస్త హడావిడి జరిగిన మాట వాస్తవమే కానీ.. పూర్తి స్థాయిలో పాలనా వ్యవస్థను తరలించడానికి కార్యాలయాలు ఇంకా సిద్ధం కాలేదు. సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చి పూర్తి స్థాయిలో పాలనా వ్యవహారాలు సాగడానికి రెండేళ్ల టైమ్ పట్టింది.
విశాఖ అన్ని వసతులు ఉన్న నగరమే అయినా.. ఉద్యోగులకు సరైన వసతి సదుపాయాలు, శాశ్వత భవనాల కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది. తాత్కాలిక భవనాలతో, చిన్న వర్షానికే ఉరిసిపోయే గ్రాఫిక్స్ బిల్డింగ్ లతో హడావిడి చేయడం జగన్ సర్కారుకి ఇష్టంలేదు. అందుకే నిలకడగా అయినా, శాశ్వతంగా మార్పు జరగాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
2. కోర్టు వ్యవహారాలు..రాజధాని తరలింపు వ్యవహారంలో ప్రస్తుతం ఏపీ హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. జస్టిస్ జేకే మహేశ్వరి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపించింది. అయితే ఇప్పుడు ఆయన మారిపోవడం, అరూప్ గోస్వామి కొత్త సీజేగా రావడంతో మళ్లీ కేసుల విచారణ మొదటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
హైకోర్టుకి వేసవి సెలవల అనంతరం.. రాజధాని కేసులపై రోజువారీ విచారణ చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ విచారణ మళ్లీ మొదటినుంచీ జరిగితే మాత్రం మరింత ఆలస్యం జరగక తప్పదు. ఒకవేళ హైకోర్టు తీర్పులతో ఏ వర్గం సంతృప్తి పడకపోయినా సుప్రీంకోర్టుకి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ వ్యవహారం ఇప్పట్లో తేలుతుందని ఎవరికీ ఆశ లేదు.
అంటే.. ఈ ఉగాదికి జగన్ కల నెరవేరేలా కనిపించడం లేదు. జాప్యం జరిగినా.. పగడ్బందీగా మార్పులు జరిగితే అదే మేలు అనుకుంటున్నారు ఉద్యోగులు, ప్రజలు. టీడీపీ చేసిన తాత్కాలిక వ్యవహారంలాగా కాకుండా.. వైసీపీ హయాంలో శాశ్వత మార్పులు జరగాలని ఆకాంక్షిస్తున్నారు.