తిమింగళాలను విడిచి పెట్టి, చిన్న చేపలను వేటాడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిజీగా ఉన్నారు. కనీసం ఇలాగైనా సంతృప్తి చెందాలని అనుకుంటున్నట్టు కనిపిస్తోంది. తనను నైతికంగా, మానసికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దారుణంగా దెబ్బతీసిన, తీస్తున్న ప్రధాన ప్రతిపక్ష నేతలను, మీడియా అధినేతల జోలికి వెళ్లకుండా, ఏమీ చేయలేరనే వాళ్లపై మాత్రం జగన్ నేతృత్వం లోని ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోందనే విమర్శ ఉంది. టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబును గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
తప్పు చేసిన వాళ్లను కటకటాలపాలు చేయడాన్ని ఎవరూ తప్పు పట్టారు. కానీ రాజధాని పేరుతో వందలాది ఎకరాలను కొల్లగొట్టిన వాళ్లు, తనపై నిత్యం తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న మీడియాధిపతులపై ఇదే చట్టాన్ని ఉపయోగించి జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారనే ప్రశ్నలు సొంత పార్టీ నుంచి ఎదురవుతున్నాయి. అంతెందుకు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ల నోళ్లను కూడా కనీసం మూయించలేని చేతికాని, నిస్సహాయ స్థితిలో జగన్ ప్రభుత్వం ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును అరెస్ట్ చేయడం పెద్ద పనేమీ కాదని అంటున్నారు. వాణిజ్యపన్నులశాఖలో అశోక్‌బాబు పనిచేసే సమయంలో తప్పుడు బీకాం డిగ్రీ సర్టిఫికెట్లను సమర్పించి, ప్రమోషన్ పొందారనేది ప్రధాన అభియోగం. దీనిపై లోకాయుక్త ఆదేశాల మేరకు వాణిజ్యపన్నుల శాఖ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేసింది. గత నెల 25న అశోక్‌బాబుపై సీఐడీ కేసు నమోదు, ఇప్పుడు అరెస్ట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
అశోక్‌బాబును అరెస్ట్ చేయడం బాగుందని, అయితే ఆర్థికంగా భారీ అవకతవకలకు పాల్పడిన నేతల్ని అరెస్ట్ చేయడం చేతకాక, చిన్నవాళ్లపై బెదిరించడం ఏంటనే ప్రశ్నలొస్తున్నాయి. జగన్ అధికారంలో వున్నప్పుడు పైబర్‌నెట్, రాజధాని, ఓట్ల తొలగింపు మాఫియా, పోలవరంలో అవినీతి తదితర అంశాలపై జగన్ తీవ్ర ఆరోపణలు చేయడాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే … కోర్టుల ద్వారా తమ చేతులు కట్టేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు సమాధానం ఇస్తారు.
నిజంగా తాము నమ్మిన దాంట్లో సరుకు వుంటే, పక్కా ఆధారాలు వుంటే… న్యాయస్థానాలు అడ్డుపడే అవకాశం ఉండదనేది మరికొందరి వాదన. జగన్ ప్రభుత్వం ఏం చేసినా అరకొరగా వుంటాయని, ఇందుకు అనేక సంఘటనలను ఉదహరిస్తున్నారు. ప్రధానంగా జగన్ ప్రభుత్వం చేతకాని తనం వల్లే ప్రధాన ప్రతిపక్ష పార్టీలోని నేరస్తులు తప్పించుకుని తిరుగుతున్నారనే విమర్శ లేకపోలేదు.