తెదేపాకి కావాల్సింది పౌరుషం కాదు సానుభూతి

జూనియర్ ఎన్.టీ.ఆర్ కి తెలుగు చలనచిత్రప్రముఖుల పక్షాన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మీటింగుకి పిలుపొచ్చింది.  Advertisement పరిశ్రమకి సంబంధించిన ఇబ్బందుల విషయంలో చర్చించడం ఆ సమావేశం ఉద్దేశ్యం.  ప్రయాణం ముందు రోజు వరకు…

జూనియర్ ఎన్.టీ.ఆర్ కి తెలుగు చలనచిత్రప్రముఖుల పక్షాన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మీటింగుకి పిలుపొచ్చింది. 

పరిశ్రమకి సంబంధించిన ఇబ్బందుల విషయంలో చర్చించడం ఆ సమావేశం ఉద్దేశ్యం. 

ప్రయాణం ముందు రోజు వరకు వెళ్తున్నట్టుగానే సంకేతాలున్నా చివరి నిమిషంలో అతను సీన్లో కనపడలేదు. 

చిరంజీవి నాయకత్వంలో తత్తిమా హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ వెళ్లారు. ఆర్ నారాయణమూర్తి, పోసాని, ఆలి, రాజమౌళి, కొరటాల శివ కూడా ఆ మీటింగులో భాగమయ్యారు. 

అసలు ఎన్.టి.ఆర్ రాకపోవడానికి కారణమేంటో తవ్వితే తెదేపా వర్గాలు వెళ్లొద్దని ఆపేసాయని తెలిసింది. అది నిజం కాదని రేపేదో కవరింగిచ్చినా ఇవ్వకపోయినా ఇదే ప్రస్తుతానికి వినిపిస్తున్న విషయం. 

తన మేనత్త నారా భువనేశ్వరీదేవిని తన మిత్రుడైన వల్లభనేని వంశీ ఒక అనకూడని మాట అంటే తాను వెంటనే ఖండించలేదని తెదేపా శ్రేణులకి జూ ఎన్.టి.ఆర్ మీద పీకల్లోతు కోపం. 

పైగా ఇదే విషయం మళ్లీ అసెంబ్లీలో ప్రస్తావనకు రావడంతో చంద్రబాబు ఏడ్చిన తర్వాత జూ ఎన్.టి.ఆర్ ఒక వీడియో బైట్ వదిలాడు. అందులో వల్లభనేనిని చెడా మడా తిడతాడని అందరూ భావించారు. కానీ అతని పేరు ఎత్తకుండా, కనీసం తన మేనత్తకు, మావయ్యకు సంఘీభావం తెలపకుండా, తాను జెనెరల్ గా చెబుతున్నాను తప్ప బాధితుల కుటుంబసభ్యుడిగా మాత్రం కాదని చెప్పడం తెదేపా వారిని మరింత బాధించింది. పర్యవసానంగా జూ ఎన్.టి.ఆర్ కి చాకిరేవు పెట్టేసారు సోషల్ మీడియాలో తెదేపా వర్గీయులు. 

ఇప్పుడు మళ్లీ జగన్ ని కలవడానికి వెళ్తున్నాడనగానే అతనిని వద్దని వార్ణింగిచ్చారు. సోషల్ మీడియా చాకిరేవుకి భయపడి మన ఆర్.ఆర్.ఆర్ కొమరం భీముడు మీటింగు మానేసి ఇంట్లో కూర్చున్నాడు. 

తెదేపా చేస్తున్న ఈ పౌరుషప్రదర్శన వల్ల ఉపయోగం ఎవరికి? 

ఈ ఒక్క విషయంలోనే కాదు…రఘురామ కృష్ణం రాజు శిశుపాలుడు రేంజులో రోజూ తెదేపా సానుకూల మీడియాలో కూర్చుని వైసీపీలోని రెడ్లని వెటకారంగా తిట్టడం, అలాగే తెదేపా సానుకూల మీడియా ఛానల్లోని యాంకర్ వేంకట కృష్ణ ఆలిని, పోసానిని ఉద్దేశించి వాళ్ల పేర్లు చెప్పకుండా థాయ్ మసాజ్, మెంటల్ కృష్ణ అంటూ చులకనగా సంబోధించడం మొదలైనవి తెదేపా మీద న్యూట్రల్ ప్రజలకు కూడా వెగటు పుట్టిస్తున్నాయి. 

పోసాని తెదేపా వ్యతిరేక స్పీచులు చాలా ఇచ్చుండొచ్చు. ఆలీ అలాంటి స్పీచులివ్వకపోయినా వైసీపీ పక్షాన ఉండొచ్చు. అంత మాత్రానికి యాంకర్ అనేవాడు తెదేపా పార్టీ వర్కర్లాగ ఆ వెక్కిరింపులెందుకు? 

వీళ్లకి తోడు తెదేపా పిచ్చని కుండబద్దలుకొట్టి మరీ బయటపెట్టుకుంటూ వైసీపీ ప్రభుత్వంపట్ల నిరంతర విద్వేషాన్ని రగిలిస్తూ యూట్యూబులో వీడియోలొదిలే అనామకులు చాలామందే ఉన్నారు. ఆ వీడియోలు తెదేపా చితికి నిప్పెట్టేముందు కుండబద్దలు కొట్టేలా ఉన్నాయి. 

ఇక ఫేస్బుక్కులో చంద్రన్న పాలన రామరాజ్యమని, మా అఖండ సినిమా అంతర్జాతీయ బ్లాక్ బస్టర్ అని, రాజ్యపాలన చెయ్యాలంటే మా కులానికి తప్ప ఇతర కులానికి అర్హత లేదని..ఇలా నానా పిచ్చికూతలూ రాసుకుంటూ తెదేపా మీద పూర్తి స్థాయి ఏహ్యభావాన్ని కలగజేస్తున్నవారు కోకొల్లలు. 

ఇలాంటి తాటాకు చప్పుళ్లు, పిట్టలదొరల కబుర్లు, స్వయం సంతృప్తి పోస్టులు వల్ల తెదేపాకి పదిపైసలు ఉపయోగం లేకపోగా కొంప ముంచుతోంది. 

ఈ హైరాన వల్లే 2019 ఓటమి తర్వాత కూడా ఇప్పటి వరకూ కనీసం ఒక్క లోకల్ ఎన్నికలో కూడా సత్తా చూపలేకపోయింది తెదేపా. ఆ పార్టీకి ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఈ పచ్చపైత్యకారులే.  

ఇప్పుడు తెదేపాకి కావాల్సింది పౌరుష ప్రదర్శన కాదు. సానుభూతి అవసరం. 

తెదేపా మీద “అయ్యో పాపం! ఎలా ఉండే పార్టీ ఎలా అయిపోయింది” అని తటస్థులు అనుకుని కాస్త దృష్టిపెట్టే లోపు పైన చెప్పుకున్న ఎవడో ఒకడు ఏదో ఒకటి కూసి “తప్పులేదు..వీళ్లకి ఇలా జరగాల్సిందే..ఈ తెదేపా ఎప్పటికీ గెలవకూడదు” అనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నారు. 

ఆవేశమే తప్ప అస్సలు ఆలోచనలేకుండా ప్రవర్తిస్తున్న తెదేపా నాయకులు, సానుభూతిపరులు అందరూ కలిసి తెదేపా ని పాడెక్కించేస్తున్నారు. 

హరగోపాల్ సూరపనేని