మొత్తానికి మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలు కొత్త మలుపు తిరిగాయి. సరిగ్గా వారం క్రితం మాన్సాస్ సిబ్బందిని మాన్సాస్ ఈవో మీదకు రెచ్చగొట్టారన్న కారణంతో ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు మీద పోలీస్ కేసు నమోదు అయింది.
ఈ నెల 17న మాన్సాస్ ఈవోను చుట్టుముట్టి సిబ్బంది అతి పెద్ద గొడవనే సృష్టించారు. ఒక దశలో ప్రాణరక్షణ కోసం ఈవో అయితే భయంతో పరుగులు తీశారు. దీని మీద మాన్సాస్ మాజీ చైర్ పర్సన్ సంచయిత అయితే బాబాయ్ మీద హాట్ కామెంట్స్ చేశారు.
మాన్సాస్ ట్రస్ట్ పరువు అశోక్ తీస్తున్నారు అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఈవోకే ప్రాణ రక్షణ లేకుండా చేయడమేనా మీ ఏలుబడి అంటూ గట్టిగానే ప్రశ్నించారు. ఇపుడు అశోక్ మీద విజయనగరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
ఇక్కడ విషయం ఏంటి అంటే అశోక్ వర్సెస్ సర్కార్ గా కధ సాగుతోంది. మధ్యలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఈవోను అశోక్ టార్గెట్ చేశారు అని సంచయిత అంటున్నారు. మరి ఆయన తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం పోలీసులను ఆశ్రయిస్తే అశోక్ సహా పది మంది మీద కేసు నమోదు అయింది.
మరో వైపు నాలుగేళ్ల క్రితం విజయనగరంలో జరిగిన అతి పెద్ద రైలు ప్రమాదం దుర్ఘటనలో కూడా సరైన విచారణ జరిపించకుండా అశోక్ తన అధికారిక హోదాను ఉపయోగించి మమ అనిపించేశారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని మోడీకి తాజాగా లేఖ రాశారు. దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆయన డిమాండ్ చేస్తున్నారు.
అశోక్ అయితే ఈ మధ్య తరచూ మీడియా ముందుకు వచ్చి జగన్ సర్కార్ మీద విమర్శలు చేస్తున్నారు. దాంతో ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడే అవకాశాలు అయితే ఇప్పట్లో లేవనే అంటున్నారు.