ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై దూషణలకు దిగిన ఇద్దరు నాయుళ్ల నోళ్లు మూయించాలని ప్రివిలేజ్ కమిటీ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
సభను తప్పుదోవ పట్టించారన్న శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదుపై.. టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులపై ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపింది. ఇందులో భాగంగా మద్యం షాపులపై అచ్చెన్నాయుడు సభను తప్పుదోవ పట్టించారని, అలాగే వృద్ధాప్య పెన్షన్ల విషయంలో నిమ్మల రామానాయుడు సభను తప్పుదోవ పట్టించారని కమిటీ నిర్ధారణ చేసింది.
ఇదిలా గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సంక్షేమ పథకాలపై జరిగిన చర్చలో భాగంగా ఉద్దేశ పూర్వకంగానే నిమ్మల రామానాయుడు సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిమ్మల రామానాయుడిపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తున్నట్టు చట్టసభలో జగన్ ప్రకటించారు. అలాంటి వాళ్లకు సభలో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకూడదని నాటి సభలో జగన్ హెచ్చరించినట్టుగానే… తాజాగా ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
సీఎం జగన్‌మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించారనే కారణంతో టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ … మైక్ ఇవ్వకూడదని మంగళవారం సమావేశమైన ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనలను ప్రివిలైజ్ కమిటీ సభ్యుడు, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వ్యతిరేకించారని తెలుస్తోంది.
రామానాయుడిని సీఎం.. డ్రామా నాయుడు అంటేనే తిరిగి రామానాయుడు జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఆయన కమిటీ సమావేశంలో గుర్తు చేశారని సమాచారం. అయితే ఆయన వాదనను ప్రివిలేజ్ కమిటీ పట్టించుకోలేదు.
అచ్చెన్నాయుడు, రామానాయుడులకు అసెంబ్లీ సమావేశాల్లో మైక్ ఇవ్వకూడదనే తీర్మాణాన్ని ప్రివిలైజ్ కమిటీ.. స్పీకర్‌కు పంపనుంది. ఇదిలా వుండగా కమిటీ సమావేశం అనంతరం ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వచ్చే అసంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు నివేదిస్తామనడం గమనార్హం.