రాజధాని ప్రాంతం లో ఆందోళనలు అదుపు తప్పుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రోద్బలంతో సాగుతున్న ఆందోళనలు అటాక్స్ గా మారుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కాన్వాయ్ మీద ఆందోళన కారులు దాడి చేశారు. ఈ దాడిలో ఆర్కే ప్రయాణిస్తున్న కారు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఆర్కే సెక్యూరిటీ మీద ఆందోళన కారులు దాడికి తెగబడ్డారు. భౌతికంగా వారిని కొట్టారు.
ఈ దాడిని హత్యాయత్నంగా అభివర్ణిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పీఆర్కే పై హత్యాయత్నం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతూ ఉన్నాయి. కాజా టోల్ గేట్ వద్ద పిన్నెళ్లి కాన్వాయ్ ని ఆందోళన కారులు అడ్డగించారు. ఒక దశలో వారితో మాట్లాడటానికి పిన్నెళ్లి కారు దిగడానికి సిద్ధపడ్డారు. అయితే అంతలోనే కాన్వాయ్ పై రాళ్లదాడి జరిగింది.
ఈ దాడిపై ఆర్కే స్పందించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని, ఇదొక పిరికి పంద చర్య అని ఆయన అన్నారు. శాంతిభద్రలకు విఘాతం కలిగించి, తన ఆస్తులను కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని పీఆర్కే అన్నారు. మొత్తానికి రాజధాని పేరుతో ఆందోళనలు ఇలా హింసాత్మక చర్యలకు దిగడం అంత సబబు గా ఉన్నట్టుగా లేదు. తెలుగుదేశం పార్టీ దగ్గరుండి ఈ ఆందోళనలకు స్పాన్సర్ షిప్ కూడా చేస్తూ ఉన్న దాఖలాలు కనిపిస్తున్న నేపథ్యంలో.. ఇక ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అవుతుందేమో!