నిజమే మరి. ఎవరికి నొప్పిగా ఉంటే వారు ఏడవాలి కానీ పక్కవారు వెక్కిళ్ళు పెడితే వెటకారంగానే ఉంటుంది. విశాఖ రాజధాని సమస్య అన్నది అక్కడ ప్రజలది, వారు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులది. విశాఖలో నాలుగు దిక్కులా నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
వారికి విశాఖ రాజధాని ఇష్టం ఉందో లేదో ముందు చంద్రబాబు కనుక్కోవాలి. వారు కాదు కూడదు అంటే అమరావతి మన రాజధాని అంటూ ఏకైక నినాదంతో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి విశాఖ వద్దు అమరావతి ముద్దు అన్న దాని మీద జనంలోకి వెళ్ళి మళ్ళీ గెలవాలి.
ఇది సరైన సవాలే. మరి చంద్రబాబు దీనికి స్వీకరించగలరా. తన పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించగలరా. అపుడు దీన్నే రిఫరెండంగా వైసీపీ తీసుకుని విశాఖను రాజధానిగా వద్దు అనుకుంటుంది.
అయితే చంద్రబాబు అమరావతి అంటూంటే విశాఖ ఎమ్మెల్యే తమ్ముళ్ళు మాత్రం కిక్కురుమనడంలేదు. పైగా భీమిలీ నుంచి ఓడిన సబ్బం హరి మాత్రం విశాఖ రాజధాని వద్దు అని ముందుకువస్తున్నారు. ఎన్నికల్లో గెలవని సబ్బం హరిని ముందు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే బాబు గెలిచిన ఎమ్మెల్యేలతో సవాల్ స్వీకరించవచ్చు కదా అని మంత్రి అవంతి శ్రీనివాస్ సరైన మాటే అంటున్నారు.
తాము అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తామని, దేనికీ వ్యతిరేకం కాదని కూడా మంత్రి చెప్పారు. బాబు మాత్రం అమరావతి పేరిట మొసలి కన్నీరు కారుస్తున్నారని కూడా మంత్రి అంటున్నారు. మొత్తానికి టీడీపీ తరఫున నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న బాబుకు సబ్బం హరి మాత్రమే కలసివస్తున్నారంటేనే విశాఖ జనం నాడి ఏంటో ఈపాటికి అర్ధమైపోలేదా బాబు అంటున్నారు వైసీపీ నేతలు.