కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. దీనికి చిన్నాపెద్దా, ధనిక పేద తేడా లేదు. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్(55) కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కరోనా మహమ్మారి నుంచి మానవాళి నేర్చుకోవాల్సిన గుణపాఠాలెన్నో ఉన్నాయి.
అవేవో తెలుసుకుందాం.
1.తనకెవరూ ఎదురు లేదనే అహంకారం ఉండకూడదు. ప్రపంచంలో తనను ఢీకొట్టే శక్తి ఏదీ లేదని విర్రవీగుతున్న అగ్రరాజ్యం అమెరికా కంటికి కనిపించని కరోనా అనే ఓ వైరస్ దెబ్బకు గజగజ వణికిపోవడమే నిదర్శనం.
2.దుష్టులకు దూరంగా ఉండటం అంటే ఎలాగో…కరోనాను ఎదుర్కొనేందుకు పాటిస్తున్న సామాజిక దూరాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
3. ఏదైనా పాజిటీవ్‌గా ఉండాలంటారు. అంటే పాజిటీవ్‌గా అర్థం చేసుకోవడం, ఆలోచించడం, నడుచుకోవడం…ఇలా అన్నీ జీవితాన్ని పాజిటీవ్‌గా మలుచుకోవాలంటారు. కానీ కరోనా విషయంలో పాజిటీవ్ అంటే మాత్రం బెంబేలెత్తిపోతారు.
4.ఏదీ శాశ్వతం కాదని, బతికి ఉన్నరోజుల్లో మంచి చేయడం ఒక్కటే జీవన విధానం కావాలి.
5.ఎవరి పనులు వాళ్లు చేసుకోవాలి. ఇతరులపై ఆధారపడటం ఎప్పటికీ మంచిది కాదు.
6.ఉద్యోగమే ఉపాధి అని కాకుండా, వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలను ప్రభుత్వాలు పెంచాలి.
7.తల్లిదండ్రులు, పెద్దలు, జన్మనిచ్చిన ఊరిని కనీసం ఆరు లేదా ఏడాదికి ఒకసారైనా సందర్శిస్తుండాలి. వాళ్ల యోగక్షేమాలను ఆరా తీస్తుండాలి.
8.అమెరికాలోనే స్థిరపడాలనే ఆలోచనలకు చరమ గీతం పాడాలి. మనమెక్కడ పుట్టామో, ఎక్కడ చదువుకున్నామో ఆ ప్రాంతాన్ని సుఖసంతోషాలతో జీవించేలా అభివృద్ధి చేయాలి. ఎవరో ధనిక ప్రాంతంగా తీర్చిదిద్దిన ప్రాంతానికి మనం వెళ్లి స్థిరపడాలనే ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టాలి.
9.తాడిని తన్నేవాడు తలతన్నే వాడొకడు ఉంటాడనే సత్యాన్ని గుర్తు పెట్టుకుని, ప్రతి ఒక్కరితో మర్యాదగా మెలగాలి.
10.ఏదైనా పెద్ద విపత్తు వచ్చినప్పుడు ఐక్యంగా ఎలా ఎదుర్కోవాలే లాక్డౌన్ నుంచి నేర్చుకోవచ్చు.
11.రాజకీయాలు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఉంటూ మన దేశాన్ని, రాష్ట్రాన్ని విపత్తు నుంచి గట్టెక్కిస్తున్నట్టే, ఇతర అంశాల్లో అభివృద్ధి సాధనలో కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించాలి.