ప్రశాంతమైన పట్టణం.. వివాదాలు-రాజకీయాలకు దూరంగా ఉండే ప్రాంతం. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనాకు కూడా శ్రీకాకుళం దూరంగానే ఉంది. ఎలాంటి పాజిటివ్ కేసులు లేవు. అలాంటి పట్టణంలో ఒక్కసారిగా కరోనా భయాందోళనలు ముసురుకున్నాయి. దీనికి కారణం శ్రీకాకుళంలో హఠాత్తుగా ఇద్దరు విదేశీ అమ్మాయిలు ప్రత్యక్షమవ్వడమే.
ఈరోజు పొద్దున్నే శ్రీకాకుళంలో హఠాత్తుగా ఇద్దరు అమ్మాయిలు రోడ్లపై కనిపించారు. ఇరాక్ దేశానికి చెందిన ఈ ఇద్దర్నీ చూడగానే అంతా అవాక్కయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే పోలీసులు.. పట్టణంలోని పాత బస్టాండ్ కు చేరుకొని యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు.
అప్పటికే ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు వేసుకున్న వాళ్లు.. తాము ఇరాక్ దేశానికి చెందిన వాళ్లమని చెప్పుకున్నారు. శ్రీకాకుళానికి దగ్గర్లో ఉన్న ఓ కాలేజీలో ఎం.ఫార్మసీ చేస్తున్నామని, పట్టణంలోనే ఓ కాలనీలో ఉంటున్నామని చెప్పారు. నిత్యావసరాలు కొనుక్కోవడం కోసం బయటకొచ్చామని పోలీసులకు వెల్లడించారు.
అయితే లాక్ డౌన్ అమల్లో ఉన్న ఇలాంటి టైమ్ లో బయటకు రావడం మంచిది కాదని స్పష్టం చేసిన పోలీసులు.. తమ వాహనంలో ఆ ఇద్దరు అమ్మాయిల్ని వాళ్ల ఇంటి వద్ద దింపారు. అమ్మాయిలిద్దరి సమాచారాన్ని, మొబైల్ నంబర్లను నోట్ చేసుకోవడంతో పాటు.. వాళ్లకు అవసరమైన నిత్యావసరాల్ని కూడా అందించారు. పేరుకు ఇరాక్ అమ్మాయిలే అయినప్పటికీ.. స్థానికంగా నివశిస్తున్నవాళ్లే అని తెలియడంతో శ్రీకాకుళం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.