మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడంటే ముక్కుసూటిగా మాట్లాడుతారనే పేరు. గతంలో గంటా శ్రీనివాసరావుని పార్టీలోకి తీసుకునే సందర్భంలోనూ, తీసుకున్న తర్వాత కూడా పదేపదే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా మొట్ట మొదట బాబు నిర్ణయానికి వ్యతిరేకంగా విమర్శలు చేసిన నేతగా అయ్యన్నపాత్రుడు గుర్తింపు పొందారు.
తాజాగా బాబు వ్యవహారశైలిపై అయ్యన్నలోని అసంతృప్తి మరోసారి బయటపడింది. అయితే ఇది కాస్తా ఆలస్యంగా వెలుగు చూడడం గమనార్హం. గత కొన్ని నెలలుగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ హైదరాబాద్‌కే పరిమితం కావడం తెలిసిందే.
కరోనా నేపథ్యంలో 70 ఏళ్ల పైన వయసున్న చంద్రబాబు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఇంటికే పరిమితమై…ఆన్‌లైన్ సమా వేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో టీడీపీ ప్రత్యక్ష కార్యాచరణ దాదాపు కనుమరుగు అయిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారడం మాజీ మంత్రి అయ్యన్నను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
నాలుగు రోజుల క్రితం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పార్టీని నడుపుతున్న తీరుపై చంద్రబాబుకు నేరుగా తన అసంతృప్తిని అయ్యన్నపాత్రుడు వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీస్‌కు తాళం వేసి వెళ్లిపోతే ఎలా? ప‌్రజలు ఏమనుకుంటారు? కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇస్తున్నాం? ఇలాగైతే పార్టీని ఎవరూ బతికించలేరు అని చంద్రబాబుపై అయ్యన్నపాత్రుడు ఫైర్ అయినట్టు సమాచారం.
ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉండిపోవడం, ఏదో చుట్టపు చూపుగా అప్పుడప్పుడు వచ్చి వెళ్లిపోవడం ఏంటని అయ్యన్న గట్టిగా నిలదీసినట్టు తెలుస్తోంది. అలాగే ఆన్‌లైన్ సమావేశాలు, మీడియా మీట్‌లకు పరిమితమై, ప్రజలను పట్టించుకోకపోతే పార్టీకి భవిష్యత్ ఉండదని అయ్యన్న హెచ్చరించినట్టు సమాచారం. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి తాళం వేసి అధ్యక్షుడు నెలల తరబడి హైదరాబాద్‌లో గడుపుతుంటే ప్రజలు ఏమనుకుంటారని అయ్యన్న ప్రశ్నించినట్లు సమాచారం.
అయ్యన్న హెచ్చరికలపై టీడీపీలో విస్తృత చర్చ సాగుతోంది. అయ్యన్న ఆగ్రహంలో న్యాయం ఉందని, ఆయన చెప్పింది వందకు వందశాతం కరెక్ట్ అని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయ్యన్న హెచ్చరికల నేపథ్యంలో బాబు ఎలాంటి రక్షణ చర్యలు చేపడుతారో చూడాలి మరి!