అయ్యన్నపాత్రుడు. టీడీపీలో సీనియర్ నేత. మాజీ మంత్రి. చంద్రబాబు మాదిరిగానే ఆయన కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు. అలాంటి అయ్యన్న తాజాగా పోలీసుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో అయ్యన్నపాత్రుడిని క్షమాపణలు చెప్పమంటూ పోలీసు అధికారుల సంఘం గట్టిగా డిమాండ్ చేస్తోంది.
అయ్యన్నపాత్రుడు పోలీసుల మీద చేస్తున్న వ్యాఖ్యలను చూసి మూడు సింహాలూ సిగ్గుపడుతున్నాయని రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలత అన్నారు. పోలీసులు మీరు అధికారంలో ఉంటే బాగున్నారా, ఇపుడు మాత్రం వారు ముఖ్యమంత్రి జగన్ కాళ్ళకు మూడు సింహాలను తాకట్టు పెట్టారా. ఏంటి మాటలు అయ్యన్నా అంటూ ఆమె ఫైర్ అయ్యారు.
అయ్యన్నపాత్రుడు గతంలో కూడా ఇలాగే మాట్లాడారు అని గుర్తు చేశారు. పోలీసుల మీద అసభ్య పదజాలం ఒక మాజీ మంత్రి ఉపయోగించడం దారుణమని అన్నారు. పోలీసులు అనుసరిస్తున్న చట్టాలు ఏ ఒక్క రాజకీయ పార్టీ పెట్టినవి కావని, బ్రిటిష్ కాలం నుంచి అవే ఉన్నాయని ఆమె అన్నారు. ఆ విషయాన్ని మాజీ మంత్రి తెలుసుకోవాలని సూచించారు.పోలీసులను బట్టలూడదీసి ప్రజలు కొట్టాలని అయ్యన్నపాత్రుడు మాట్లాడమేంటి అని ఆమె నిలదీశారు.
ఆ ప్రజలు మిమ్మల్నే తరిమికొడతారు జాగ్రత్త అని హెచ్చరించారు. కొవిద్ సమయంలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోలీసులు చేసిన సేవలు అయ్యన్నకు గుర్తు లేవా అని ప్రశ్నించారు. విధి నిర్వహణలో నిత్యం అసువులు కోల్పోతున్న పోలీసుల గురించి అయ్యన్న ఇలా మాట్లాడడం కంటే బాధాకరం వేరొకటి ఉండని అన్నారు.
అందరికీ ఒకే చట్టం, ఒకటే న్యాయం అని మాజీ మంత్రి తెలుసుకోవాలని స్వర్ణలత అన్నారు. అయ్యన్న మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం మంత్రికి, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని ఆమె పేర్కొన్నారు. మొత్తానికి అయ్యన్నపాత్రుడు తన నోరుని అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల పోలీసులకు గట్టిగానే టార్గెట్ అయ్యారు.