కల్వకుంట్ల కవితతో వారు ఊరుకోలేదు!

తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను ఏకగ్రీవంగా పార్టీ గెలిపించుకుంది. నిజామాబాద్ లో గత పార్లమెంటు ఎన్నికల సమయానికి తెరాస మీద వ్యక్తమైన వ్యతిరేకత ఫలితంగా నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. …

తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను ఏకగ్రీవంగా పార్టీ గెలిపించుకుంది. నిజామాబాద్ లో గత పార్లమెంటు ఎన్నికల సమయానికి తెరాస మీద వ్యక్తమైన వ్యతిరేకత ఫలితంగా నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. 

అలాంటి అనుభవాలు ఉన్నప్పటికీ.. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి.. కవితను ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ చేయగలిగారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి.. ఆ ఒక్క ఎన్నికతో ఊరుకోలేదు. మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ వీలైనన్ని స్థానాల్ని ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.

తెలంగాణ రాజకీయాలలో తాజాగా మళ్లీ బేరసారాల పర్వం జోరుగా నడుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు. ఈ 12 స్థానాలకు అధికార పార్టీ ఎప్పుడో అభ్యర్థులను ప్రకటించింది. కల్వకుంట్ల కవితతో ఆగకుండా.. మొత్తం 12 మంది అభ్యర్థులనూ ఏకగ్రీవంగా గెలిపించుకోవాలి అన్నట్లుగా తపన పడిపోతోంది. 

అధికార పార్టీ వ్యూహాలు ఒక స్థాయి వరకు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే మొత్తం 12 స్థానాలకు గాను ఇప్పటికే ఆరు ఎమ్మెల్యే స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన ఆరు స్థానాల్లో కూడా కనీసం నాలుగు చోట్ల ఏకగ్రీవం చేయించాలనే ఉద్దేశంతో నాయకులు పావులు కదుపుతున్నారు. ఆయా స్థానాల్లో నామినేషన్ల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ.. అక్కడి అభ్యర్థులందరితో సంప్రతింపులు జరుపుతున్నారు.

ప్రధానంగా ఉన్న పోటీ అంతా ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచే. దాంతో సామ దాన భేద దండోపాయాలు రంగప్రవేశం చేశాయి. ఏదో ఒక తీరుగా వారిని ఒప్పించి నామినేషన్లు నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తున్నారు. దండోపాయాల వరకు వెళ్లే అవసరం లేదు. కానీ ఈ క్రమంలో భారీగా బేరసారాలు కూడా నడుస్తున్నాయి. 

నామినేషన్ వేసి బరిలో ఉంటే ఏదో ఒక ఆఫర్ తగలక పోతుందా అని ఎదురు చూస్తున్న వారు కూడా ఉన్నారు. అందరికీ కాకపోయినా.. కాస్త బలమైన అభ్యర్థి అనుకున్న వాళ్లకి ఆఫర్ లు ప్రకటించి.. నామ్ కే వాస్తే నామినేషన్లు వేసిన వారికి నచ్చజెప్పి మొత్తానికి ‘ఏకగ్రీవం’ అనిపిస్తున్నారు. 

కరీంనగర్ అయ్యే చాన్స్ లేదా కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవం కాకపోవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఇండిపెండెంట్ గా ఉన్నారు. ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. తాజాగా పార్టీకి రాజీనామా కూడా చేశారు. మరే ఇతర ఆఫర్ ఇచ్చినా సరే ఆయన ఒప్పుకోకపోవచ్చునని పార్టీ వర్గాలు అంటున్నాయి. 

హుజూర్ నగర్ కోల్పోయినా సరే.. సునాయాసంగా గెలిచే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా.. కొంత పరువు దక్కుతుందని తెరాస భావిస్తోంది.