నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు నీచమైన భాషతో దూషించినా మేనల్లుడైన యువ హీరో ఎన్టీఆర్ సరిగా స్పందించలేదని టీడీపీ కొత్త రాగం ఎత్తుకుంది. భువనేశ్వరిపై వైసీపీ నేతల దూషణకు నిరసనగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తన సతీమణితో కలిసి విజయవాడలో తన నివాసంలో ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావం ప్రకటించిన టీడీపీ నేతలంతా ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్‌పై ఓ పథకం ప్రకారం చంద్రబాబునాయుడు, లోకేశ్ కుట్ర చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్‌లో తనకు అడ్డు రాకుండా, ఇప్పటి నుంచే ఎన్టీఆర్‌ను బద్నాం చేయాలనే కుట్రలో భాగంగా లోకేశ్ స్క్రిప్ట్ ప్రకారమే అంతా జరుగు తోందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇదిలా వుండగా వర్ల చేపట్టిన దీక్షలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఎన్టీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘నాని, వంశీ చేసిన వ్యాఖ్యలకు శ్రీమంతుడులా ఆయుధం పట్టుకుని వస్తాడనుకుంటే తుస్సుమనిపించారు. సింహాద్రి, ఆది సిని మాల్లో మాదిరిగా రంగంలోకి దిగి దుయ్యబడతారనుకుంటే నిరాశపరిచారు. స్వయానా మేనత్తను అవమానపరిస్తే ఖండించడం వల్ల కూడా కేరీర్ దెబ్బతింటుందా?’ అని బుద్ధా ప్రశ్నించారు.
మేనల్లుడు ఎన్టీఆర్ స్పందించారనేది స్పష్టం. అయితే ఆ స్పందన చంద్రబాబు, లోకేశ్‌లకు నచ్చలేదని తాజాగా ఆ పార్టీ నాయకుల విమర్శలను బట్టి అర్థమవుతోంది. ఎన్టీఆర్ చాలా సంస్కారవంతమైన భాషలో మొత్తం రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడారు. ప్రత్యర్థులు కూడా ఆలోచించేలా ఎన్టీఆర్ అప్పీల్ ఉంది. ఇందులో చంద్రబాబు, లోకేశ్ బాధపడాల్సిన అంశం ఏంటో అర్థం కావడం లేదని ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
తమ హీరోను పక్కన పెడితే… కన్నతల్లిని దూషిస్తే…. కుమారుడిగా లోకేశ్ స్పందన ఏంటని ఎన్టీఆర్ అభిమానులు నిలదీస్తున్నారు. లోకేశ్‌లో ఉడుకు రక్తం ప్రవహిస్తుంటే ఎందుకని ఆయుధాలు తీసుకుని వంశీ, నాని, అంబటిపైకి వెళ్లలేదని నిలదీస్తు న్నారు. తల్లిని దూషించారనే చర్చ ముగిసిన మూడు రోజులకు లోకేశ్ నోరు తెరిచారని గుర్తు చేస్తున్నారు. అది కూడా సానుభూతి పొందేందుకే తప్ప, ఎలాంటి హెచ్చరికలు చేయలేదని గుర్తు చేయడం గమనార్హం.
దివంగత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో నందమూరి వారసులంతా ఎక్కడున్నారో తెలియదని, కానీ నారా వారసుడిగా లోకేశ్ అధికారాన్ని అనుభవించాడని, రాజకీయ వారసుడిగా అతనే తెరపై ఉన్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు చెబుతున్నారు. ఇదే ఎన్టీఆర్‌ను ఏనాడైనా మేనల్లుడిగా గుర్తించారా? అని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఎన్టీఆర్ స్వయంకృషితో ఎదిగారని, హీరోగా తనను తాను నిరూపించుకుని అందరి మన్ననలు పొందుతున్న తరుణంలో, ఆయన్ను రాజకీయంగా వాడుకునేందుకు మేనల్లుడంటూ మాటల్లో అభిమానం ప్రదర్శిస్తున్నారనే సంగతి లోకానికి బాగా తెలుసని అభిమానులు దెప్పి పొడుస్తున్నారు.
2009 ఎన్నికల్లో చిన్న వయసులో ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లి ప్రాణం మీదకు తెచ్చుకున్నారని గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో లోకేశ్ ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదని మండిపడుతున్నారు. ఇదే 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే లోకేశ్ మంత్రి అయ్యారని, దివంగత హరికృష్ణ తనయ సుహాసినిని మాత్రం కూకట్‌పల్లిలో నిలిపి ఓడిపోవడానికి కారణమయ్యారని మండిపడుతున్నారు.
కుమారుడికి అధికారం, మేనకోడలికి ఓటమిని బహుమతిగా ఇచ్చిన వాళ్లా… ఈ రోజు ఎన్టీఆర్ సరిగా స్పందించలేదని మాట్లాడేదంటూ విరుచుకుపడుతున్నారు. ఎన్టీఆర్ ఎదుగుదలలో నారా, నందమూరి పాత్రమే లేదని, కేవలం ఆయన స్వయంకృషి మాత్రమే ఉందనే సత్యం అందరికీ తెలుసంటున్నారు.
టీడీపీ పాలిట ఎన్టీఆర్ నక్షత్రమైతే, లోకేశ్ గ్రహమని… అందుకే ఆ యువనాయకుడి భయం పట్టుకుని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆలనాపాలనను నారా, నందమూరి కుటుంబాలు పట్టించుకున్న తీరు గురించి, ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని అభిమానులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నిజాలు నిప్పులాంటివని చెబుతున్నారు.