వైఎస్సార్‌కు దండం పెట్టాల‌నిపిస్తుందిః జ‌గ‌న్ బ‌ద్ద శ‌త్రువు

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులు మాత్ర‌మే ఉంటార‌నే మాట చెప్పుకోడానికి బాగుంటుంది. వాస్త‌వానికి ఏపీ రాజ‌కీయాలు అంత సంస్కార‌వంతంగా లేవు. ఇటీవ‌ల కాలంలో మ‌రింత జుగుప్సాక‌రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు త‌యార‌య్యాయి. చివ‌రికి రాజ‌కీయ స్వార్థం కోసం ఏ…

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులు మాత్ర‌మే ఉంటార‌నే మాట చెప్పుకోడానికి బాగుంటుంది. వాస్త‌వానికి ఏపీ రాజ‌కీయాలు అంత సంస్కార‌వంతంగా లేవు. ఇటీవ‌ల కాలంలో మ‌రింత జుగుప్సాక‌రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు త‌యార‌య్యాయి. చివ‌రికి రాజ‌కీయ స్వార్థం కోసం ఏ మాత్రం సంబంధం లేని మ‌హిళ‌ల‌ను కూడా బ‌జారుకీడ్చ‌డం… ఏపీ రాజ‌కీయ దిగ‌జారుడుత‌నానికి నిద‌ర్శ‌నం.

ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు బ‌ద్ద శ‌త్రువైన మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు ఓ మీడియాధిప‌తికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించి విడుద‌లైన ప్రోమో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. 

జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త నింప‌డ‌మే ఏకైక ల‌క్ష్యంగా ఇంట‌ర్వ్యూలు, వారాంత‌పు క‌థ‌నాలు రాసే స‌ద‌రు జ‌ర్న‌లిస్టు, య‌జ‌మాని ఇంట‌ర్వ్యూలో వైఎస్సార్‌పై అద్భుత కామెంట్స్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఇదే ప్రోమోలో జ‌గ‌న్‌ను దుర్మార్గుడిగా దూషించ‌డాన్ని కూడా చూడొచ్చు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎదురుగా వస్తే లేచి దండం పెట్టాలనిపిస్తుందని అయ్య‌న్న‌పాత్రుడు అభిన‌యిస్తూ చెప్పారు. కానీ దుర్మార్గుడైన‌ జగన్‌ను చూస్తే అలా అనిపించదని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారాయ‌న‌. వైఎస్సార్‌పై పొగ‌డ్త‌ల‌తో పాటు జ‌గ‌న్‌పై అయ్య‌న్న తెగ‌డ్త‌ల‌కు స‌ద‌రు ఇంట‌ర్వ్యూ క‌ర్త అహ్హ‌హ్హ అంటూ త‌న మార్క్ చిద్విలాస న‌వ్వు పులిమారు. 

త‌న కొడుకు విజ‌య్‌తో క‌లిసి అయ్య‌న్న ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే తానే సీనియర్‌ను అని, ఆ విషయాన్ని ఆయనతోనే చెప్పాననే సంచ‌ల‌న కామెంట్స్ అయ్య‌న్న చేయ‌డాన్ని గ‌మ‌నించొచ్చు.