బాబు అవినీతి పాపాన్ని కడుగుతున్న కొత్త సర్కార్‌

ఏదేశమేగినా, ఎందుకాలిడినా, పొగడరా నీతల్లి భూమి భారతిని అని ఒకకవి భారతదేశం గురించి గొప్పగా చెప్పాడు. ఇప్పుడు అదేతీరులో ఏపీ అసెంబ్లీలో అధికారపక్షం ఏశాఖలో వేలెట్టినా, ఏపద్దు తిలకించినా చెప్పరా బాబు చేసిన వేలకోట్ల…

ఏదేశమేగినా, ఎందుకాలిడినా, పొగడరా నీతల్లి భూమి భారతిని అని ఒకకవి భారతదేశం గురించి గొప్పగా చెప్పాడు. ఇప్పుడు అదేతీరులో ఏపీ అసెంబ్లీలో అధికారపక్షం ఏశాఖలో వేలెట్టినా, ఏపద్దు తిలకించినా చెప్పరా బాబు చేసిన వేలకోట్ల అవినీతిని అని మంత్రులు ఎమ్‌ఎల్‌ఏలు ఠారెత్తిపోయి మరీ బహిర్గతం చేస్తున్నారు. వాటిని పక్కదారిలో పెట్టేందుకు బాబు అండ్‌కో అసెంబ్లీలో పడరానిపాట్లు పడుతున్నారు. బాబు మొదట్నించి సభను పక్కతోవ పట్టించడంలో పేరుమోసారు. ఆయన అధికారం చెలాయించినప్పుడు అదేతీరులో అసెంబ్లీని తన గుప్పిట్లోకి లాక్కుని మరీ సభను తనకు ఇష్టం వచ్చిన తీరులో నడిపించుకు పోవడంలో అప్రతిహాతంగా తనప్రజ్ఞను చాటుతూ సాగారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా నేను చెప్పిందే వేదం అనే తీరులోనే చిరుబురులాడుతూ తప్పుల తడకగానే సాగుతున్నారు. నోరువిప్పితే అబద్దాల మూటను విప్పి వక్కాణిస్తున్నారు. ఇలా బాబు నైజం ఉండడానికి కారణం? బాబుకు అన్నివిధాల అహం వదులుకోలేనంతగా నిలువెత్తు ఆక్రమిం చేసింది. అదేమంటే తను 40ఏళ్లుగా రాజకీయాల్లో రాణిస్తూ సాగుతున్నాను.

నన్నుమించిన సీనియర్‌ మోదీ సయితం కారు. నాతో ఏ విషయంలో మోదీ పోటీలో లేనేలేరు. పలుదఫాలు సీఎంగా, ప్రతిపక్షనేతగా, ఆపైన ఢిల్లీలో రాజకీయచక్రం తిప్పానని చెప్పుకోవడంలో దర్పం ప్రదర్శిస్తునే ఉన్నారు. నాముందు మీరెంత? మీ అనుభవం ఎంత? అనేట్టు అందరిని తేలిగ్గా చూస్తున్నారు. ఒక్కోసారి నా రాజకీయ అనుభవం పాటిలేదు నీ వయస్సు అని సాక్షాత్తు సీఎం జగన్‌పై విరుచుకుపడి చెప్పడంలో బాబు వెనుకాడడం లేదు. అసెంబ్లీలో లోగడ జరిగిన అవినీతి అంశాలపై లోతుచర్చ జరుగుతుంటే దానిలో తను చెప్పాల్సింది నిలువెత్తు అబద్ధాలు నింపేసి మరీ చెప్పడంలో కూడా బాబు తగ్గుటలేదు. తనపాలనలో లోపాలను అధికారపక్షం బయట పెట్టినప్పుడు ఒక్కోసారి రెచ్చిపోతున్నారు. దాంతో మందిబలం ఉన్న వైకాపాసభ్యులు బాబు మాటలకు ధీటుగా వ్యంగ్యంగా బదులిస్తునే ఉన్నారు.

బాబుకు ఉన్న భయం ఏమిటీ అంటే అన్నిశాఖల్లో కన్నూమిన్నూ కానకుండా భవిషత్‌పై భయంలేకుండా తనుచేసిన అవినీతిని వేలేత్తి చూపుతున్నారు. విచారణ జరుపుతామని మంత్రులు ప్రకటిస్తుంటే భయపడుతున్నారు. బయటికి మాత్రం విచారణ జరపండి. మేమూ సహకరిస్తాం, స్వాగతిస్తాం అని చెబుతున్నారు. వ్యవసాయపనుల్లో రైతాంగం ఉంది. వర్షాలు సరిగ్గా కురవనేలేదు. కొంతమేరకు అలా ఇలా పడినా అక్కడ విత్తనాలు ఇవ్వడంలో జగన్‌ సర్కారు ఫెయిల్‌ అయ్యిందని టీడీపీ సభ్యులు గొంతులు పెంచారు. ఇది అనవసరంగా కెలుక్కున్నా మనేలా వారిపై అధికారపార్టీ సభ్యులు విత్తనాలు అందించాల్సినంతమేర సరఫరా చేయలేకపోవడానికి కారణం చంద్రబాబే అని ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలయ్యారు.

గడచిన నవంబర్‌లో విత్తనాల సేకరణకు సర్కారు ముందుకుపోవాలి. అలా చేయకుండా వారికి పెద్ద మొత్తం బాకీలుపడ్డారు. ఆ తట్ట మానెత్తిన పెట్టాలనుకోవడం ఏపాటిన్యాయం అని మంత్రులు బాబునే ప్రశ్నించారు. ఇలా వ్యవసాయశాఖలో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుని దాన్ని తెలివిగా 40రోజుల కొత్త సర్కారుపై నెట్టడంలో టీడీపీ 23మంది సభ్యులు ఘోరంగా విఫలమయ్యారు. తీరా, విత్తనాల కొరతకు అసెంబ్లీ సాక్షిగా తామే కారణం అన్నట్లు బాబ్‌ అండ్‌ కో చేతులెత్తేసింది. ఇలా తాముచేసిన పలుతప్పులను కొత్తగా వచ్చిన సర్కారు పైకి నెట్టేందుకు యత్నాలు సాగడంలేదు. కీయా మోటార్సు విషయంలో అయితే, తను విదేశీ పర్యటనల చేయబట్టే వచ్చిందని చెప్పారు. ఇందులో కూడా తిమ్మినిబమ్మిని చేసారు. దీనిపై ఆర్ధికమంత్రి బుగ్గన ఇది 2007లో వైయస్‌ కోరిక మీదట ఏపీలో ఎప్పుడైనా పెడతామనుకున్నారు ఆసంస్థ యాజమాన్యం. వారు ఆర్ధికంగా పరిపుష్టి అయ్యాక 2016లో పెట్టామని కియోసంస్థ మూలవిరాట్టు గతనెలలో లేఖ రాసారని చదివి విన్పించారు. దీనిపై బాబునీళ్లు నమిలేసారు.

ఆ మరుసటిరోజు అసెంబ్లీలో వేరే అంశంపై బాబు మాట్లాడుతూ మద్యలో కియో మోటార్సుపై మంత్రి బుగ్గన మంచికథ చెప్పారు. వైయస్‌ ఆత్మ వెళ్లి కియోమోటార్సుకు చెప్పి నాహయాంలో పెట్టించారా? అని వ్యంగ్యంగా అంటూ నిండునవ్వులు కురిపించారు. మోదీని కలిసినప్పుడు తప్ప ఎన్నడూ నవ్వని బాబు బుగ్గనకు అభినందనలు అని తెరలు తెరలుగా నవ్వి అభినందించారు. కొస మెరుపుగా కీయా మోటర్సు తనే తెచ్చానని చెప్పడంలో బాబు వెనుకాడలేదు. దాంతో కియోలో మీప్రమేయమే లేదని తిప్పికొట్టడంలో బుగ్గన ఆలేఖను మరోసారి సభలో చూపారు. బాబు కొత్త అసెంబ్లీ తొలిరోజు నుంచే మంది బలం ఉన్న జగన్‌ సర్కారును తడబాటుకు గురిచేయాలంటే వైయస్‌ పాలనపై విమర్శలు గుప్పించాలని నిర్ణయించారు. అందుకే వైయస్‌ పాలనలో లేనిపోని లోపాలను ఎత్తిచూపేలా సింహనాదాలు చేస్తే జగన్‌ అండ్‌కో బదులీయలేక సద్దుమణుగుతుంది. ఇలా బాబు లేనిపోని విమర్శలతో జగన్‌కు అడ్డంపడొచ్చు అని రెడీ అయ్యారు.

వైయస్‌ పాలనపై గత ఐదేళ్లు తన మంత్రులవద్ద మీడియామీట్లలో నిప్పులు చెరిగేవారు. దానికి మీడియాద్వారా జగన్‌ అండ్‌కో బదులిచ్చేది. ఒకవేళ అధికారంలో ఉన్న చంద్రబాబు మంత్రులు వైఎస్‌ను నరరూప రాక్షసుడు వంటి పదాలతో అసెంబ్లీలో తూలనాడితే 67మందితో ప్రతిపక్షంలో వైకాపా ఎదురుదాడి చేస్తే వారిపై మంత్రులను, స్పీకర్‌ను బాబు ఉసిగొలిపేవారు. జగన్‌ నోరు మూతేయడానికి ప్రతిశుక్రవారం కోర్టు. లక్షకోట్ల అవినీతి ఇలా గత ఐదేళ్లూ వైకాపాను అసెంబ్లీలో హీనపరచడంలో బాబు అండ్‌కో ఏమాత్రం తగ్గలేదు. ఆతీరునే ఇప్పుడు జగన్‌ సర్కారుపై చూపడానికి ప్రతిపక్ష బాబు వైఎస్‌పై చిన్న చిన్న విమర్శలు చేస్తూ 151 అధికారపార్టీ సభ్యులను ఏవిధంగా స్పందిస్తారా అని గమనిస్తున్నారు. అయితే వైఎస్‌పై ఈగవాలితే జగన్‌ కంటే వైకాపా సభ్యులే కిర్రెక్కిపోతున్నారు. ఇక్కడే బాబు గుర్తించాల్సింది ఉంది. వైఎస్‌ జనరంజకపాలకుడు. అదెవరు కాదనలేరు. కనుకనే ఆయన మరణం ఏపీలో జీర్ణించుకోలేకపోయారు. వందలాదిమంది హఠాన్మరణానికి గురయ్యారు.

వైయస్‌ కుమారుడు అప్పటి కాంగ్రెస్‌ ఎంపీ జగన్‌కు రాజకీయాల్లో ఓనమాలు తెలియవు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వందలాది మందిని లుసుకుని ఓదార్చాలను కున్నారు. అప్పుడు జగన్‌కు మాట కారితనమే లేదు. ఆయాత్రలో పోటెత్తిన జనసునామీల్లో నాలుగుమాటలకే పరిమితమై  చెబుతుండేవారు. వైయస్‌ అంటే ఏపీ జనాలకు పిచ్చ అభిమానం. అందుకే, జగన్‌ తలపెట్టిన 2009 ఓదార్పుయాత్ర నుంచి 2019వరకు సాగిన రకరకాల జనయాత్రలకు, పాదయాత్రలు వరకు జగన్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ జన సముద్రాలయ్యారు. 2014లో 600 బూట కపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు 67సీట్లతో జగన్‌ బలమైన ప్రతిపక్షంగా మోహరించారు. ఈగెలుపు కూడా నాటి వైఎస్‌ పాలనలో సంతృప్తులైన జనాలు ఇచ్చిందే. ఆనాడు వైఎస్‌ పాలనచూసి యావత్‌ దేశమే గుడ్లప్పగించింది. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలను మూట కట్టుకుపోయి ఆయారాష్ట్రాలలో అమలు చేసారంటే వైఎస్‌ పాలన ఎలాఎల్లలు దాటింది?

ఏమాట చెప్పినా దాన్ని తుంగలోకి తొక్కని నైజం వైఎస్‌ది. ఆయన గుర్తుగా ఒకపార్టీ పుట్టింది. దానికి నాయకుడు జగన్‌ అయ్యారు. కేవలం వైఎస్‌ మరణాంతరం వైఎస్‌ కుటుంబాన్ని కాంగ్రెస్‌ ఇడుముల పాలు చేసిందని ఏపీలో కాంగ్రెస్‌ క్యాడర్‌ అత్యధికభాగం వైఎస్‌ఆర్‌ పార్టీలోకి దూసుకుపోయింది. తప్పితే విభజన వలన కాంగ్రెస్‌ పతనంకాలేదు. దాంతో కాంగ్రెస్‌ ఏపీలో నిర్వీర్యమై పాడెక్కిపోయింది. 2014నుంచి గెలుపు అనేదే లేకుండా అసెంబ్లీలో వెతికితే పార్టీ అవశేషం కూడా కన్పించకుండా కనుమరుగయ్యింది. తండ్రి చేసిన రామ రాజ్యపాలనతో జనాల్లోకి వెళ్లిన జగన్‌కు జన నీరాజనాలు దక్కాయి పార్టీకి పోటెత్తిన క్యాడర్‌ వెన్నుదన్ను అయ్యింది. లేకుంటే జగన్‌ ఎవరు? అసలు వైకాపా పుట్టేదా? ఇదంతా చంద్రబాబుకు తెలియంది కాదు. అన్నీ తెలిసిన రాజకీయ అహంభావి చంద్రన్న అని ఆపార్టీ వారందరికి తెలుసు. వారికి తెలిసినంతగా వేరెవ్వరికి తెలియదు.

అలాంటి వైఎస్‌ను అసెంబ్లీలో చంద్రబాబు వేలెట్టి చూపితే వైకాపా సభ్యులు తోకతొక్కిన త్రాచుల్లా విరుచుకు పడుతున్నారు. సీఎం జగన్‌ అదుపుతప్పి బాబును నిట్టనిలువునా  విమర్శలతో ముంచెత్తుతున్నారు. అయినా వైఎస్‌ పేరు ఎత్తి అధికార పక్షాన్ని రెచ్చిపోయేలా చేద్దామనే టీడీపీ అసలు సిసలు ఎత్తుగడ. బాబు ఏదో ఒకటి వేలెట్టి చూపితే నాలుగు వేల్లు (వైకాపా) ఆయన్నే దుయ్యబడుతున్నాయి. దాంతో తట్టుకోలేకపోతూ బాబు అండ్‌కో రెచ్చిపోతున్నారు. స్పీకర్‌తోనో, సీఎంతోనో, మంత్రులతోనో, ఎమ్‌ఎల్‌ఏలతోనో అదుపు చేయబడి సీట్లలో చతికిలా బడాల్సివస్తోంది. బాబు అండ్‌ కో ఆశించేది వైయస్‌ పేరుతో కెలికితే అధికారపక్షం రెచ్చిపోయి, మాటతూలుతుంది. ప్రజల ముందు జగన్‌ మంది బలంతో ప్రతిపక్షనేత చంద్రబాబును నానామాటలంటున్నారు. వయస్సయినా చూడడంలేదని జనాలు అయ్యో! పాపం అంటారని ఎత్తుతో వైఎస్‌ పాలనపై విమర్శలకు తెగబడుతున్నారు. తీరా, అధికారసభ్యులు బాబు అండ్‌కోని రెచ్చిపోయేలా చేసి చతికిలపడేలా చేస్తున్నారు.

సదావర్తి భూములపై విచారణ, విద్యుత్‌ కొనుగోళ్లపై విచారణ, పోలవరంపై విచారణ ఇలా బాబుపాలనలో విపరీతంగా జరిగిన అనేకానేక అవినీతి పనులపై విచారణలకు సర్కారు శ్రీకారం చుట్టేస్తోంది. రేపు ఈ విచారణలు వలన బాబుకు ఏమయిపోతుంది అనేది వేరేవిషయం. బాబుపై కేసులు ముసురుతాయా? జైలుకు పంపబడతాడా? లేకుంటే మిస్టర్‌క్లీన్‌ సర్టిఫికెట్‌తో బయటపడతారా అనేది ఇక్కడ అప్రస్తుతం.చట్టం దానిపని అది చేసుకుంటూపోతుంది. బడ్జెట్‌ సమావేశాలు పూర్తికాకుండా రెండుమూడు రోజులకే జగన్‌ సర్కారును ఇరుకులో పెట్టడం కుదరలేదు. సరికదా తాము చేస్తున్న అభియోగాలను తిప్పికొట్టడంలో వైకాపా సభ్యులు పక్కా ఆధారాలతో చెబుతున్నారు. ఇరుకునపెడుతున్నారు. ఇక కొత్తవారితో నిండిన వైకాపా సభ్యులు కీ ఇచ్చిన బొమ్మల్లా పక్కా సబ్జెక్టుతో ఎదురుదాడులు చేస్తున్నారు.

చంద్రబాబు పార్టీని అన్నివిషయాల్లో ఒంటిచేత్తో నడపడంలో అప్రతిహాతంగా సాగుతునే ఉన్నారు. అందులో అధికారంలో ఉన్నప్పుడు అదేతీరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదేతీరులో ఉండడం విశేషమనే చెప్పాలి. అయితే, ప్రతి పక్షనేతగా రెండుసార్లు అధికార కాంగ్రెస్‌ను ముప్పతిప్పలు పెట్టారు. అప్పుడు బాబును కాంగ్రెస్‌యోధులు నిలువరించడంలో పలు యాతనలు పడ్డారు. ఇప్పుడు బాబు మరింత రాజకీయ ముదురు అయ్యారు. అయితే, వైకాపా సభ్యులను పిల్లకాకుల్లా చూడడమే కాదు. వారిని తన వాక్పటిమతో నిలువరించ చూస్తున్నారు. కానీ, వారు సుతిమెత్తగా బాబునే నిలువరిస్తున్నారు. మూడోసారి సీఎంగా అవినీతిని మూటకట్టుకున్న చంద్రబాబు మూడోసారి ప్రతిపక్షనేతగా వైకాపా సభ్యుల ముందు డీలాపడుతున్నారు. తాను ఒకటంటే వారు పదంటున్నారు. బాబుకు ఈసారి ప్రతిపక్షపాత్ర శిరోవేదన కలిగిస్తోంది.
-యర్నాగుల సుధాకరరావు

జగన్‌ మొహంలో చిరునవ్వు మార్పు కనబడుతోంది