రోజులు గడుస్తుంటే చంద్రబాబు మతి భ్రమణం పూర్తిస్థాయిలో జరిగిపోయిందని అర్థమవుతోంది. అసెంబ్లీలో చంద్రబాబు మాటలు విన్న ఎవరికైనా ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా సీఎం జగన్ పరిస్థితి చూస్తే జాలేస్తోంది. చంద్రబాబు మాటలు విని నవ్వాలో, అవి తప్పు అని చెప్పాలో తెలియని పరిస్థితిలోకి వెళ్లిపోయారు జగన్. అందుకే బాబు మాటలు తప్పు అని చెప్పడం బదులు హాయిగా నవ్వేసి ఊరుకుంటున్నారు జగన్.
సోమవారం అసెంబ్లీలో జగన్ నవ్వులు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జనసేన ఎమ్మెల్యే తనని ఆకాశానికెత్తేసినప్పుడు కూడా కాసేపు నవ్వి ఊరుకున్న జగన్, చంద్రబాబు ప్రసంగం ఆసాంతం పడీ పడీ నవ్వారు. జగన్ ని అంతలా నవ్వించిన చంద్రబాబు ఏం చెప్పారో తెలుసా? డ్వాక్రా సృష్టికర్త తానేనంటూ డప్పుకొట్టుకున్నారు. డ్వాక్రా పథకానికి సృష్టికర్త నేనే, దాన్ని దేశవ్యాప్తంగా అనుసరించారు, ఆ తర్వాత అది ప్రపంచానికే ఆదర్శమైంది అంటూ బాబు జోక్ వేశారు.
డ్వాక్రా పేరెత్తగానే.. సభ ఘొల్లుమంది. వైసీపీ సభ్యులంతా బాబుపై సెటైర్లు వేశారు, సెల్ ఫోన్ సృష్టికర్త, టెక్నాలజీ పిత అంటూ రన్నింగ్ కామెంట్రీ అందుకున్నారు. జగన్ మాత్రం ఆయన మాటలకు అడ్డు తగలలేక పడీ పడీ నవ్వారు. అమరావతి నిర్మాణాన్ని వైసీపీ అడ్డుకుంటోందని, తాముచేసిన అభివృద్ధికి అడ్డుపడటం మంచిదికాదని కూడా హితబోధ చేశారు చంద్రబాబు. ఇదే సమయంలో తాను హైదరాబాద్ ని అభివృద్ధి చేస్తే.. ఆ తర్వాత సీఎం అయిన రాజశేఖర్ రెడ్డి తాను చేసిన కార్యక్రమాలను కొనసాగించారే కానీ అడ్డుకోలేదని అన్నారు.
ఈ ఉదాహరణ చెబుతూనే అమరావతిలో కూడా జగన్ తాను చేసిన అభివృద్ధిని కొనసాగించాలని చెప్పుకొచ్చారు బాబు. అసెంబ్లీ తొలిరోజు నుంచీ చంద్రబాబు ఇలా కామెడీ చేస్తూనే ఉన్నారు. నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం ఇంకాస్త ఎక్కువగా జగన్ ను నవ్వించారు.