మొన్నటివరకు రేషన్ డీలర్లపై ఓ అయోమయ స్థితి ఉండేది. పౌర సరఫరాల వ్యవస్థలో లోపాల్ని సరిదిద్దేందుకు రేషన్ సరకుల డోర్ డెలివరీ సిస్టమ్ ప్రవేశ పెడతామని బడ్జెట్ లో వైఎస్ జగన్ సర్కార్ ప్రకటించింది. దీనికోసం ప్రత్యేకంగా 3750 కోట్ల రూపాయలు కూడా కేటాయించింది. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా నాణ్యమైన సరుకులను ప్రజలకు అందించేలా ఏర్పాట్లు చేయబోతున్నారు. దీంతో రేషన్ డీలర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక దశలో వాళ్లు ఆందోళనకు కూడా దిగారు. ఎట్టకేలకు దీనిపై జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది.
రేషన్ డీలర్ల ఉపాధికి తమ ప్రభుత్వం గండికొట్టదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టంచేశారు. వాళ్లందర్నీ స్టాకిస్టులుగా మారుస్తామని స్పష్టంచేశారు. అదే సమయంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఇదే సమయంలో రేషన్ డీలర్ల వ్యవస్థలో ప్రక్షాళన తప్పదని కూడా స్పష్టంచేశారు.
2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రేషన్ డీలర్లను మార్చేసిందని, టీడీపీ కార్యకర్తలకు చాలా చోట్ల నిబంధనలకు విరుద్ధంగా డీలర్ షిప్ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రాగానే అలాంటి అక్రమ రేషన్ డీలర్లందరూ ఆందోళన చెందుతున్నారని, టీడీపీ అనుకూల డీలర్లు మాత్రమే ఆందోళన చేస్తున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అక్రమాలను సహించదని, నిబంధనలకు విరుద్ధంగా డీలర్లుగా కొనసాగుతున్న వారిపై మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాజా స్టేట్ మెంట్ తో తమ డీలర్ షిప్ ఉంటుందా, ఊడిపోతుందా తెలియక సందిగ్ధంలో పడిపోయారు కొంతమంది. మొత్తమ్మీద ఒక విషయంలో మాత్రం క్లారిటీ వచ్చింది. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, దానితోపాటు రేషన్ డీలర్లు కూడా ఉంటారు. ఎవరి పని వారు చేసుకుంటారు.