సీఆర్డీఏ రద్దు బిల్లు, ఏపీలో పాలన వికేంద్రీకరణ బిల్లు.. గవర్నర్ దగ్గరకు చేరిన సమయంలో ప్రతిపక్షాలు పసలేని వాదనలు చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి యనమల, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. గవర్నర్ కు రాసిన లేఖలు చూస్తుంటే.. వాటిని చెత్త బుట్టలో పడేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఓ ఆసక్తికరమైన అంశం వెలుగుచూసింది. అమరావతి ఉద్యమాన్ని లేఖలో బాబు ప్రస్తావించకపోవడం గమనార్హం.
చంద్రబాబు తన లేఖలో అమరావతి రైతుల త్యాగాలు మరచిపోవడం విడ్డూరం. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పెయిడ్ ఉద్యమాన్ని చంద్రబాబు ఎక్కడా తన లేఖలో ప్రస్తావించలేదు. రాజధాని కోసం రైతులు తమ పొలాల్ని త్యాగం చేశారని చెప్పారే కానీ, రాజధాని రాకపోవడంతో వారికొచ్చిన ఇబ్బంది ఏంటో మాత్రం వివరించలేకపోయారు.
ప్రెస్ మీట్లు, వీడియో కాన్ఫరెన్సుల్లో రాజధాని రైతుల త్యాగాలు, ఆత్మహత్యలు అంటూ రెచ్చిపోయే బాబు.. గవర్నర్ కి రాసిన లేఖలో ఎంతమంది రైతులు రాజధాని కోసం ప్రాణ త్యాగం చేశారనే విషయాన్ని ఎందుకు పొందుపరచలేదు. అంటే ఆ త్యాగాలన్నీ రాజధాని కోసం కాదా?? సాధారణ మరణాలని కూడా అమరావతి ఉద్యమం అకౌంట్లో వేశారా? అనే సందేహం కలగకమానదు.
అమరావతికి గొప్ప చరిత్ర ఉందని, రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారనీ చెప్పిన చంద్రబాబు.. విశాఖ, కర్నూలుకి పాలన వికేంద్రీకరణ జరిగితే.. అమరావతికి కలిగే నష్టమేంటో స్పష్టం చేయలేదు. కేవలం తాను, తన అనుచరులు అమరావతిలో పెట్టిన పెట్టుబడులు కరిగిపోతాయనే ఉద్దేశంతోటే చంద్రబాబు ఇప్పటి వరకూ రాజధాని నాటకం ఆడారని అందరికీ తెలుసు. గవర్నర్ కి రాసిన లేఖతో మరోసారి అది స్పష్టమైంది.
మొత్తానికి అమరావతి ఉద్యమం గురించి మాత్రం చంద్రబాబు ప్రస్తావించకపోవడం విచిత్రమే. కేవలం చట్టపరమైన అంశాల్ని మాత్రమే లేఖలో ప్రస్తావించి ఆ రెండు బిల్లులకు ఆమోద ముద్ర వేయొద్దంటూ తన సుదీర్ఘ లేఖలో పసలేని వాదనలన్నీ చేశారు బాబు.