భారతీయ సమాజాన్ని కరోనా కంటే తీవ్రంగా కులజాడ్యం పట్టి పీడిస్తోంది. చివరికి నేరస్తుల విషయంలోనూ కులం కోణాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా…నేరం పక్కకు పోతోంది. ఇది అత్యంత ప్రమాదకర ధోరణి. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల గ్యాంగ్‌స్టర్ దుబే ఎన్‌కౌంటర్‌కు గురైన విషయం తెలిసిందే. దుబేను అదుపులోకి తీసుకోడానికి వెళ్లిన పోలీసులపై కాల్పుల జరిపి వాళ్ల ఉసురు తీసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత అతన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు సినీ ఫక్కీలో ఎన్కౌంటర్ చేశారు. కాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్షత్రియుడు కాబట్టే బ్రాహ్మణుడైన దుబేను ఎన్కౌంటర్ చేయించారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ విషయమై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ ఆసక్తికరంగా ఉంది.
దుబే బ్రాహ్మణుడు కాబట్టి క్షత్రియుడైన ఉత్తరప్రదేశ్ సీఎం ఎన్కౌంటర్ చేయించారనే ప్రచారంలో అర్థం లేదని స్వామి కొట్టి పారేశారు. క్షత్రియుడైన శ్రీరాముడు రాక్షస గుణాలున్న బ్రాహ్మణుడైన రావణుడిని హతమార్చారని సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేశారు. కానీ రాముడిని బ్రాహ్మణులంతా పూజిస్తారని ఆయన తెలిపారు.
సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్‌తో దుబే ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన రెండో కోణం కూడా తెలిసొచ్చింది. ఏపీలో అవినీతి, హత్యా నేరాలకు సంబంధించి మాజీ మంత్రుల అరెస్ట్ విషయాన్ని కూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కులం కార్డును ప్రయోగించి భంగపడిన విషయం తెలిసిందే.