ఇన్నాళ్లూ వివిధ కారణాలు, జగన్ పై ఉన్న సింపతీతో ఎన్నికల్లో ఓడిపోయామనుకుంటున్న చంద్రబాబుకి ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్టు కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అవసరం లేకున్నా సంతలో పశువుల్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడం, సొంతవారిని కాదని వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం వంటివి పూర్తిగా రివర్స్ అయ్యాయని బాబుకి అర్థమైంది. అందుకే కడపజిల్లా పర్యటనలో చంద్రబాబు జ్ఞానోదయం అయిన వ్యక్తిలా మాట్లాడారు.
“అధికారంలో ఉన్నప్పుడు వచ్చే ఆయారాం, గయారాంలకు ఇక స్వస్తి పలుకుదాం” అన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో విధేయులనే ఎన్నుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాను రాను చంద్రబాబుని 23 సెంటిమెంట్ బాగా ఇబ్బంది పెడుతున్నట్టుంది. 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి తమవైపు తెచ్చుకున్నందుకు ప్రతిగానే తమకు ఈ దఫా కేవలం 23 సీట్లు వచ్చాయని నమ్ముతున్నారు.
అధికారంలోకి ఉన్నప్పుడు తమవైపు వచ్చేవాళ్లు, అధికారం కోల్పోయిన తర్వాత అటువైపు వెళ్లడానికి ఏమాత్రం సంకోచించరని, అలాంటి వారి వల్ల పార్టీకి విధేయులుగా ఉన్నవారు కూడా పక్క చూపులు చూస్తారని బాబుకి బాగా అర్థమైంది. అప్పుడు నిర్లక్ష్యం చేయబట్టే.. ఇప్పుడు వల్లభనేని వంశీ లాంటి వారు కూడా పార్టీ మారుతున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే మార్పు తన నుంచే రావాలని చంద్రబాబు ఆలోచనగా ఉంది. అందుకే పార్టీ విధేయులను గుర్తించే పనిలో పడ్డారు.
నామినేటెడ్ పదవుల పంపకంపై జగన్ అనుసరిస్తున్న విధానం కూడా చంద్రబాబుకి కళ్లు తెరిపించింది. అధికారంలో ఉన్నప్పుడు నాలుగేళ్లు సైలెంట్ గా ఉండి, చివరి ఏడాది వివిధ కార్పొరేషన్ల పదవులు భర్తీ చేశారు బాబు. పేరుకే ఈ పనిచేశారు కానీ, ఆ పని వల్ల ఎవరికీ ఏమీ ఒరగలేదు సరికదా బాబుపై వ్యతిరేకత పెరిగింది. పార్టీ కోసం పనిచేసిన వారిని జగన్ గుర్తిస్తున్న తీరు, గుర్తించి మరీ వారికి ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇస్తున్న విధానంపై కూడా కడప జిల్లో పార్టీ ముఖ్యుల వద్ద చర్చించారు చంద్రబాబు.
తాము ఇలాంటి పని చేయలేకపోయామని, చేసి ఉంటే మరికొంతమంది మనస్ఫూర్తిగా పార్టీ కోసం పనిచేసేవారని వాపోయారు. మొత్తమ్మీద జగన్ విధానాలు చంద్రబాబులో మార్పుకి కారణం అవుతున్నాయి, జ్ఞానోదయం కలిగిస్తున్నాయి.