రాజధాని ఆందోళన.. పదోరోజు, 20వ రోజు, 25వ రోజు.. 40వ రోజు అంటూ.. కౌంట్ పెరిగిపోయింది. అంతే వేగంగా ఆ నకిలీ ఉద్యమం నీరుగారిపోయింది కూడా. ముఖ్యంగా మండలి రద్దు తర్వాత టీడీపీ నేతలెవరూ అటువైపు తిరిగి చూడ్డంలేదు. ధర్నాలు, అరెస్ట్ లు అయిపోయాయి కాబట్టి ఇప్పుడేం చేయాలో వారికే దిక్కు తెలియట్లేదు. చంద్రబాబు కూడా రెస్ట్ లో ఉన్నారు.
ఊరూరా జోలెపట్టి తిరిగినా జనం ఛీకొడుతుండేసరికి బాబుకి జ్ఞానోదయం అయినట్టుంది. మిగతా ప్రాంతాల నుంచి వస్తున్న వ్యతిరేకతతో చంద్రబాబు యు-టర్న్ కి సిద్ధమవుతున్నారు. తనని పూర్తిగా కార్నర్ చేసి కేవలం 29 గ్రామాలకు పరిమితం చేస్తున్నట్టుగా బాబుకి ఎక్కడో లైట్ వెలిగింది. అందుకే సైలెంట్ గా ఉద్యమం నుంచి పక్కకు తప్పుకున్నారు. సమస్యల పేరుతో రాద్ధాంతం చేయాలనుకున్నా.. ఇప్పుడు ఎవర్నీ రెచ్చగొట్టే పరిస్థితులు లేవు, పోనీ ఓవర్ యాక్షన్ చేద్దామనుకుంటే.. ఎంత రెచ్చిపోతే అంత అణగదొక్కేస్తున్నారు సీఎం జగన్.
మండలి రద్దుతో జగన్ తో ఇక పెట్టుకోకూడదని ఫిక్స్ అయ్యారు బాబు. అందుకే రెండు రోజులుగా పార్టీ కార్యాలయానికే పరిమితమైపోయారు. దీంతో భలే మంచి ఛాన్స్ అనుకుంటూ బాబుతో ఫొటో దిగాలని కోరిక ఉన్న జనాలందర్నీ పార్టీ ఆఫీస్ కి తరలించేస్తున్నారు స్థానిక నాయకులు. తెలంగాణ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి కూడా జనం వచ్చి మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ఫొటోలు దిగి వెళ్తున్నారు. ఊరికే వస్తే ఏం బాగుంటుందని, వస్తూ వస్తూ అమరావతిలో రైతుల దీక్షను చూసి వస్తున్నామని, మీరే వారికి అండగా నిలవాలని చెబుతున్నారట పార్టీ అభిమానులు.
రెండు రోజులుగా ప్రెస్ మీట్లు కూడా లేకుండా ఖాళీగా ఉన్న చంద్రబాబు కూడా వీరితో ఫొటోలకు ఫోజులిచ్చి పంపించేస్తున్నారు. మొత్తానికి మండలి విషయంలో జగన్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోని చంద్రబాబు అలా నోరు మూసుకుని ఓ మూల కూర్చున్నారన్నమాట. దీంతో సోషల్ మీడియాలో బాబుపై మరోసారి సెటైర్లు స్టార్ట్ అయ్యాయి. గతంలో ఆయన ఉపయోగించిన పాత డైలాగ్ నే మరోసారి గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు రక్తం మరగట్లేదా చంద్రబాబూ అంటూ ప్రశ్నిస్తున్నారు.