బాల్యంలోనే అమ్మానాన్నలను పోగొట్టుకున్నాడు. కానీ వందలాది, వేలాది అమ్మానాన్నలను నీకందించే నేనున్నానంటూ ‘మేధస్సు’ ఆ బాలుడి చెంత చేరింది. పువ్వు పుట్టగానే పరిమళించిన చందంగా తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో విజ్ఞాన మొక్కగా పెరుగుతూ….మహావృక్షమవుతాడని ఆశించిన వాళ్ల ఆకాంక్షలను ‘విధి’ విధ్వంసం చేసింది. చిత్తూరు జిల్లాలోనే కాదు…దేశ వ్యాప్తంగా ఎక్కడ ఏ విజ్ఞాన ప్రదర్శన జరుగుతున్నా అక్కడ రోబోటిక్ శాస్త్రవేత్తగా పేరొందిన తిరుపతి విద్యార్థి లక్ష్మీపతి ఉండాల్సిందే. అతి చిన్న వయస్సులోనే మేధస్సుకు పతిగా నిలిచిన ఆ విద్యార్థి అనారోగ్యంతో తనువు చాలించి సుదూరాలకు వెళ్లిపోయాడు.
తిరుపతి ఎస్టీవీ నగర్‌కు చెందిన లక్ష్మీపతి (15) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. దీంతో ఆ బాలుడిని ఎస్టీవీనగర్ నగరపాలక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు రేణుక తల్లిలా అక్కున చేర్చుకున్నారు. తన దగ్గరే ఐదో తరగతి వరకు విద్యాబుద్ధులు నేర్పారు. ఆ తర్వాత చెన్నారెడ్డికాలనీలోని ప్రభుత్వ వసతిగృహంలో చేర్పించి, నెహ్రూ నగరపాలక ఉన్నత పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశం కల్పించారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో లక్ష్మీపతి పదో తరగతి విద్యార్థి.
లక్ష్మీపతిలోని ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయులు అతన్ని జిల్లా సైన్స్ సమన్వయకర్త నీలకంఠానికి అప్పగించారు. నీలకంఠ సారథ్యంలో లక్ష్మీపతి మేధస్సుకు పదును పెట్టారు. దేశ వ్యాప్తంగా అనేక సైన్స్ ప్రయోగాలకు అతను హాజరవుతూ ప్రతిభ కనబరుస్తూ వస్తున్నాడు. 2017, 2018వ సంవత్సరాల్లో గుజరాత్, ఢిల్లీ, ముంబై, చెన్నై తదితర నగరాల్లో సైన్స్ ఎగ్జిబిషన్లలో పాల్గొని అనేక అవార్డులు, ప్రశంసలు పొందాడు. అంతేకాకుండా తన మేధస్సుతో జిల్లాకు, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాడు.
ఈ నెల 27న దక్షిణ భారతదేశ స్థాయి విజ్ఞాన సదస్సులో పాల్గొనేందుకు చెన్నై వెళ్లాల్సి ఉంది. అయితే 26న కొంచెం నలతగా ఉండటంతో జ్వరం ఉందని గుర్తించారు. వైద్యం ప్రారంభించారు. 27న మూత్రంలో రక్తం కనిపించడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందించారు. ఆ తర్వాత 28న స్విమ్స్‌కు తరలించారు. వైద్య పరీక్షల్లో పిత్తాశయంలో రాళ్లు, గుండెకు చిల్లు ఉన్నట్టు గుర్తించారు. బాలుడి నేపథ్యం గురించి తెలుసుకున్న స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ ఎంతో సానుకూలంగా స్పందించి వైద్యం అందించసాగారు.
కానీ ఇన్‌ఫెక్షన్ కిడ్నీలకు చేరడంతో బుధవారం లక్ష్మీపతి ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచాడు. బాలమేధావి మరణ వార్తతో చిత్తూరు జిల్లా విద్యారంగం కన్నీటి పర్యంతమైంది. తిరుపతిలో జరిగిన అంత్యక్రియల్లో వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని ఘన నివాళులర్పించారు.
ఇప్పుడతను లేడు. అతని జ్ఞాపకాలు పరిమళాలై వికసిస్తున్నాయి. ఇప్పుడతను లేడు….కానీ తన మేధస్సు ద్వారా స్ఫూర్తి దీపమై వెలుగొందుతున్నాడు. అయినా మరణం అనే మనిషి దేహానికి తప్ప మనసుకు కాదంటున్నప్పుడు….లక్ష్మీపతి ఎక్కడికి వెళుతాడు. వందల, వేల మందిలో రగిల్చిన మేధోజ్వాల ఇప్పటికీ, ఎప్పటికీ లక్ష్మీపతి పేరును వెలగిస్తూనే ఉంటుంది.