ఏపీ అసెంబ్లీలో చేసిన మండలి రద్దు తీర్మానం పార్లమెంట్ సెక్రటేరియట్ కు చేరింది. దాన్ని హోంశాఖకు పంపిస్తుంది సెక్రటేరియట్. అక్కడ్నుంచి తీర్మానం లోక్ సభలో చర్చకు వస్తుంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభకు వస్తుంది. అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి సంతకం పెట్టిన తర్వాత దాన్ని నోటిఫై చేస్తారు. దాంతో అధికారికంగా మండలి రద్దయినట్టు అవుతుంది. దాదాపు 3 నెలలు పట్టే ఈ ప్రాసెస్ మొత్తాన్ని కేంద్రం తలకెత్తుకుంటుందా? లేక ఈ సమావేశాల వరకు లైట్ తీసుకుంటుందా?
వాస్తవంగా మాట్లాడుకుంటే కేంద్రాన్ని అస్సలు ప్రభావితం చేయని అంశం ఇది. నిజంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఇరకాటంలో పెట్టాలనుకుంటే ఈ సమావేశాల్లో మోడీ సర్కార్ ఈ తీర్మానాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టదు. తద్వారా మండలిని మరింత పొడిగించడానికి వీలవుతుంది. టీడీపీ అదే కోరుకుంటోంది. సో.. ఇప్పుడు మండలి రద్దు అంశం పూర్తిగా మోడీ-జగన్ సంబంధాలపై ఆధారపడి ఉందన్నమాట.
ప్రస్తుతానికైతే మోడీ-జగన్ ఇద్దరూ శత్రువులు కాదు, అలా అని మంచి స్నేహితులు కూడా కాదు. అంశాలవారీగా మాత్రమే మోడీతో జగన్ కలుస్తున్నారు, అప్పుడప్పుడు విభేదిస్తున్నారు. సో.. జగన్ పై మోడీకి సాఫ్ట్ కార్నర్ ఉందా లేదా అనే విషయం ఈ తీర్మానంతో తేలిపోతుంది. బడ్జెట్ ఆమోదం పూర్తయిన తర్వాత మండలి రద్దు అంశం పార్లమెంట్ లో చర్చకు వచ్చిందంటే.. మోడీ-జగన్ మధ్య సత్సంబంధాలున్నట్టే లెక్క. ఈ సమావేశాల్లో చర్చకు రాకపోతే మాత్రం కాస్త ఆలోచించుకోవాల్సిందే.
మరోవైపు ఈ సమావేశాల్లో మండలి రద్దు అంశం చర్చకు రాకుండా ఉండేందుకు 2 వర్గాలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ఒకటి టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన రాజ్యసభ సభ్యుల వర్గం. ఇప్పటికీ బాబుతో టచ్ లో ఉన్న వీళ్లంతా, చంద్రబాబు సూచనల మేరకు పార్లమెంట్ లో మండలి రద్దు అంశం చర్చకు రాకుండా చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు మండలి రద్దు అంశాన్ని వ్యతిరేకిస్తున్నఏపీ బీజేపీ నేతలు కూడా కేంద్రానికి చెప్పాల్సింది చెబుతూనే ఉన్నారు. ఈ రెండు వర్గాల ప్రయత్నాలు ఫలిస్తే, ఈ సమావేశాల్లో తీర్మానం ఆమోదం పొందకపోవచ్చు.
ఇలా ఎన్ని అంశాలు చెప్పుకున్నప్పటికీ ప్రధానంగా ఇది మోడీ-జగన్ మధ్య ఉన్న సత్సంబంధాల మధ్య మాత్రమే ఆధారపడి ఉంది. జగన్ ఇప్పటికే ఈ దిశగా కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. ఇక ఇప్పుడు బంతి మోడీ కోర్టులో ఉంది. ప్రధాని తలుచుకుంటే నెల రోజుల్లోపే ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. లేదంటే.. మరికొన్ని నెలల పాటు మండలి యథాతథంగా కొనసాగుతుంది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు పెండింగ్ లోనే ఉంటాయి.