కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కార్యకర్తల స్లో‘గన్’ నుంచి బాబు గుండెల్లో జూ.ఎన్టీఆర్ తూటా పేలింది. శాంతిపురంలో నిర్వహించిన ర్యాలీలో చంద్రబాబుకు కార్యకర్తల నుంచి ఆసక్తికర, ఆశ్చర్యకర డిమాండ్ ఎదురైంది. కుప్పానికి జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ తరపున తీసుకు రావాలని , అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన్ను తిప్పాలనే డిమాండ్ కార్యకర్తల నుంచి రావడంతో చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ డిమాండ్ చంద్రబాబును కలవరానికి గురి చేస్తోంది.
ఈ అనూహ్య పరిణామానికి చంద్రబాబు షాక్‌కు గురయ్యారు. ఏం సమాధానం చెప్పాలో ఆయనకు నోట మాట రాలేదు. చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకురావాల్సిందేనంటూ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ రావాలంటే, టీడీపీ నుంచి ఎవరు పోవాలి? ఇప్పుడిదే ప్రశ్న అందరి మనసుల్లో నానుతోంది.
తన పుత్రరత్నం లోకేశ్‌ను రాజకీయ వారసుడిగా ముందుకు తేవాలని చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. బాబు ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని దూసుకుపోవాల్సిన లోకేశ్ …రోజురోజుకూ తన అపరిపక్వత చేష్టలతో గ్రామస్థాయి నాయకుడిగా స్థిరపడిపోతున్నారనే ఆందోళన టీడీపీలో వ్యక్తమవుతోంది.
లోకేశ్‌లో ఫైర్ కనిపించడం లేదనే విమర్శలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నా …చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఎంతో బలంగా ఉందని ఇంత కాలం ప్రత్యర్థులు కూడా నమ్ముతూ వచ్చారు. కానీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు , రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో కంటే కుప్పంలో కూడా టీడీపీ పరిస్థితి భిన్నంగా లేదని నిరూపించాయి. దీంతో ఇప్పటికైనా మేల్కోకపోతే తనకే ఎసరు పెట్టేలా ఉన్నారని చంద్రబాబు భయాందోళనకు గురై ఆయన కుప్పానికి ఆగమేఘాలపై వెళ్లారు.
బాబు ఎదుటే జూనియర్ ఎన్టీఆర్ రావాలనే డిమాండ్ కార్యకర్తల నుంచి వచ్చిందంటే ….ఇది ఆయనకు ప్రమాద సంకేతాలను ఇచ్చినట్టే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు సహా లోకేశ్ వల్ల పార్టీ మనుగడ సాధ్యం కాదని, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనుమడు, చరిష్మా ఉన్న యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే దిక్కు అనే సంకేతాలు కార్యకర్తలు పంపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2009లో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ప్రచారం చేసి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా నల్గొండ జిల్లాలో ఎన్టీఆర్ వాహనానికి ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ఆస్పత్రిలో బెడ్‌పై నుంచే ఆయన తన ఉపన్యాసాల ద్వారా ప్రచారం చేయడం గమనార్హం.
ఆ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాల కూటమి చతికల పడింది. ఎన్టీఆర్ ప్రచారానికి పెద్ద ఎత్తున జనం వచ్చారే తప్ప, ఆయన పర్యటించిన ప్రాంతాల్లో ఓట్లు మాత్రం రాలేదు. కానీ ఆకట్టుకునే ఉపన్యాసకుడిగా, ప్రజాకర్షణ నేతగా జూనియర్ ఎన్టీఆర్ గుర్తింపు పొందారు.
2018లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ అక్క సుహాసిని కూకట్పల్లి నుంచి బరిలో నిలిచారు. అక్క తరపున ప్రచారానికి ఎన్టీఆర్ వస్తారని అందరూ భావించారు. కానీ ఆయన అటు వైపు తొంగి చూడలేదు. చంద్రబాబు నైజం తెలిసే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు, మరీ ముఖ్యంగా టీడీపీకి దూరంగా ఉంటూ, సినిమాల్లో బిజీ అయ్యారనే వాదన ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్‌తో ప్రచారం చేయించాలనే డిమాండ్ ….అది కూడా చంద్రబాబు ఎదుట రావడం గమనార్హం.
బాబు నిర్ణయం ఎలా ఉన్నా ….కార్యకర్తల మనసులో మాట… స్లో‘గన్’ నుంచి తూటాలా పేలిందన్నది వాస్తవం. ప్రస్తుతం విత్తనం దశలో ఉన్న ఆ నినాదం, నెమ్మదిగా మొక్కగా, ఆ తర్వాత చెట్టుగా ఇంతింతై పెరగదనే నమ్మకం ఏంటి? అప్పుడు లోకేశ్ గతి ఏంటి? అనేది చంద్రబాబును తప్పక ఆందోళనకు గురి చేస్తుంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.