బీహార్ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి ఓడిపోవడం ఖాయమేనని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నా.. గెలుపు ముంగిట వరకు వచ్చి ఆగిపోతుందని వివరణ ఇస్తున్నాయి.
అంటే పదిహేనేళ్ల పాటు అప్రతిహతంగా ఆ రాష్ట్రాన్ని ఏలినా కూడా నితీష్ కుమార్ పై అసంతృప్తి అనేది ఆ స్థాయిలో లేదనే విషయం అర్థమవుతోంది. మరి చంద్రబాబుకి ఏంటి ఈ దరిద్రం. ఘోర పరాభవాల్లో చంద్రబాబు రికార్డుని ఏ ముఖ్యమంత్రి కూడా చెరిపేయలేరేమో అనిపిస్తుంది.
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పరాజయాల ట్రాక్ రికార్డ్ అత్యంత ఘోరంగా ఉంది. ముఖ్యమంత్రి హోదాలో 2004 ఎన్నికలను ఎదుర్కొన్న చంద్రబాబు.. వైఎస్ఆర్ ప్రభంజనాన్ని తట్టుకోలేక తోకముడిచారు.
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఉన్న 294 స్థానాల్లో టీడీపీకి దక్కినవి కేవలం 47 సీట్లు. అంటే చంద్రబాబు పాలనపై ప్రజలకు అప్పట్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
ఆ తర్వాత రాష్ట్ర విభజన పరిణామాలతో, రెండు కళ్ల సిద్ధాంతం అనే నాటకాలతో అదృష్టవశాత్తు చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ దఫా బాబు పనితనం ఐదేళ్లలోనే జనాలకి బాగా అర్థమైంది. ఎంతలా అంటే.. విభజిత ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాల్లో బాబుకి కేవలం 23 సీట్లు మాత్రమే దక్కాయి. అంటే ఇది మరీ ఘోరమైన ఓటమి అన్నమాట.
2004 ఎన్నికల్లో చంద్రబాబు హయాంలోని టీడీపీకి కేవలం 16శాతం సీట్లు దక్కగా.. 2019 ఎన్నికల్లో టీడీపీకి కేవలం 13శాతం మాత్రమే సీట్లు దక్కాయి. అంటే వైఎస్ఆర్ కొట్టిన దెబ్బ కంటే మరింత గట్టిగా జగన్, చంద్రబాబుని చాచి కొట్టారని అర్థమవుతోంది.
అధికార పార్టీలపై ప్రజల్లో అసంతృప్తి ఉండటం సహజం, అయితే దాన్ని అధిగమించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తేనే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. చంద్రబాబుకి అలాంటి అవకాశమే లేదు.
ఎందుకంటే.. బాబు చేసిన అభివృద్ధి తక్కువ, చేసుకున్న ప్రచారం ఎక్కువ. ఈ విషయాలన్నీ ప్రజలకు అర్థమ్యయాయి కాబట్టే 2019 ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారు. 13శాతం సీట్లకు పరిమితంచేశారు.
బహుశా దేశంలోని ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి ఇంత ఘోర పరాభవం దక్కదేమో. ఆ రికార్డు కూడా బాబు పేరిట పదిలంగా పదికాలాలపాటు ఉంటుంది. తథాస్తు.