పెళ్లిపై తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అన్నారు. అది కూడా తనకు నిక్‌తో పరిచయం అయిన తర్వాతే అని ఆమె చెప్పుకొచ్చారు.
తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివాహ వ్యవస్థపై తన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చారామె. ఇరవై ఏళ్ల వయస్సులో పెళ్లిపై తన ఆలోచనలు భిన్నంగా ఉండేవన్నారు. అసలు పెళ్లి అనే మాటే వింతగా అనిపించేదన్నారు.
కెరీర్‌లో సాధించాల్సింది ఎంతో ఉందని, అందువల్ల దానికి దూరంగా ఉండాలని అనుకున్నట్టు తెలిపారు. కానీ నిక్ జోనస్ పరిచయంతో పెళ్లి పట్ల తన దృక్పథం మారిపోయిందన్నారు. అతడి సాహచర్యంతో వైవాహిక జీవితం , ఆ బంధం ఎంత గొప్పదో అనుభవంలోకి వచ్చిందన్నారు.
నిక్ సాంగత్యంలో వివాహ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నట్టు తెలిపారు. మన ఆలోచనల్ని, అభిప్రాయాల్ని గౌరవించే భాగస్వామి దొరకడం అంత సులభం కాదని ఆమె తెలిపారు. కోరుకున్న లక్షణాలున్న వాడి గురించి ఎప్పుడైతే వెతకడం మానేస్తామో అప్పుడే మన జీవితంలో సరౌన వ్యక్తి వచ్చినట్టుగా గుర్తించాలన్నారు.
కాగా ప్రియాంక తన కంటే పదేళ్లు చిన్న వాడైన అమెరికన్ పాప్ గాయకుడు , నటుడు నిక్ జోనస్‌ను ప్రేమించి 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతనితో జీవితాన్ని పంచుకున్న తర్వాత పెళ్లిపై తన దృక్పథం మారిందని ప్రియాంక చెప్పడం విశేషం.