తమిళనాట సినీ హీరోల పొలిటికల్ ఎంట్రీలు రచ్చరచ్చ అవుతున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం గురించి అభిమానులు ఒకలా స్పందిస్తుంటే, ఆయన మరోలా స్పందిస్తున్నారు. రాజకీయాల్లోకి రావడం పట్ల రజనీకాంత్ కు పెద్ద ఆసక్తి లేదని స్పష్టం అవుతూ ఉంది. అయితే అభిమానులు మాత్రం ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ డిమాండ్లు చేస్తూ ఉన్నారు!
ఆ సంగతలా ఉంటే.. మరో స్టార్ హీరో విజయ్ ఇంట్లోనే రాజకీయ రచ్చ మొదలైంది. విజయ్ తండ్రి ఏర్పాటు చేసిన పార్టీ వివాదంగా మారుతోంది. దర్శకుడు అయిన చంద్రశేఖర్ చాన్నాళ్లుగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ పట్ల రకరకాల ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఏకంగా ఒక రాజకీయ పార్టీని ప్రారంభించారు.
అందులో తన తనయుడి ఫొటోలు, పేరు వాడుతున్నారు. దీని పట్ల స్వయంగా విజయ్ అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. ఏ రాజకీయ పార్టీ అయినా తన ఫొటోలు, పేరు వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని విజయ్ హెచ్చరించాడు. దీనిపై విజయ్ తండ్రి స్పందిస్తూ.. తనను జైల్లో పెట్టినా పొలిటికల్ పార్టీ లో విజయ్ ఫొటోలను వాడేదే అని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఒక తండ్రిగా విజయ్ కు ఏం కావాలో తనకు తెలుసని, అందుకే విజయ్ కోసం రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినట్టుగా ఆయన చెబుతున్నారు.
చంద్రశేఖర్ పలు విజయవంతమైన సినిమాలకు దర్శకుడు. డైరెక్టర్ గా ఆయనుకున్న ఇమేజ్ తోనే విజయ్ సినిమాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత తండ్రికి మించిన స్టార్ అయ్యాడు.
ఇప్పుడు పొలిటికల్ పార్టీ విషయంలో తండ్రీ, కొడుకుల మధ్యన విబేధాలు రచ్చకెక్కాయి. విజయ్ ను రాజకీయాల్లోకి తీసుకురావడం తండ్రిగా తన బాధ్యత అంటూ చంద్రశేఖర్ చెప్పుకుంటున్నారు. విజయ్ మాత్రం తన ఫొటోను, పేరును వాడితే చర్యలే అని స్వయంగా తండ్రికే బహిరంగంగా స్పష్టం చేశాడు. చంద్రశేఖరేమో తండ్రిగా భావోద్వేగ పూరితంగా మాట్లాడుతున్నారు.
ఎంత తండ్రి అయితే మాత్రం.. కొడుకు ఇష్టపడకుండా రాజకీయాల్లోకి తీసుకురావాలని చూడటం మాత్రం సమంజసంగా అనిపించదు. మరి ఈ తండ్రీ కొడుకుల పొలిటికల్ మెలో డ్రామా ఎంత వరకూ వెళ్తుందో!