కర్మ సిద్ధాంతం అంటే ఇదే చంద్రబాబూ!

ఎవరు చేసిన కర్మకు వాళ్లే బాధ్యులు. ఈ జన్మలో చేసిన తప్పులకు ఈ జన్మలోనే అనుభవిస్తారని కొందరు చెబుతుంటారు. ఇందులో ఎంత నిజముందో చెప్పలేం కానీ, చంద్రబాబును చూస్తే మాత్రం కర్మ సిద్దాంతం వంద…

ఎవరు చేసిన కర్మకు వాళ్లే బాధ్యులు. ఈ జన్మలో చేసిన తప్పులకు ఈ జన్మలోనే అనుభవిస్తారని కొందరు చెబుతుంటారు. ఇందులో ఎంత నిజముందో చెప్పలేం కానీ, చంద్రబాబును చూస్తే మాత్రం కర్మ సిద్దాంతం వంద శాతం నిజం అనిపిస్తుంది.

గతంలో చంద్రబాబు ఏవైతే చేశారో.. అవన్నీ ఇప్పుడు ఇనస్టాల్ మెంట్స్ రూపంలో ఒక్కొక్కటిగా తిరిగి చంద్రబాబుకే తగులుతున్నాయి. తాజాగా బుచ్చయ్య చౌదరి ఎపిసోడ్ దీనికి మరో పెద్ద ఉదాహరణగా నిలిచింది.

నియంత.. నిరంకుశత్వం

గతంలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్ని సంతలో పశువుల్ని కొన్నట్టు కొన్నారు చంద్రబాబు. అలా కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో జగన్ ను ఇష్టమొచ్చినట్టు తిట్టించారు. జగన్ ను నియంత అన్నారు. నిరంకుశత్వం అన్నారు. 

సరిగ్గా ఇప్పుడు అవే పదాలు చంద్రబాబుకు రివర్స్ లో తగిలాయి పార్టీని, ఎమ్మెల్యే పదవిని వీడడానికి సిద్ధమైన బుచ్చయ్య చౌదరి.. చంద్రబాబు-లోకేష్ లను నియంతలు అన్నారు. వాళ్లు చాలా నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

టీడీపీలో ప్రజాస్వామ్యం లేదన్నారు, సీనియర్ అయిన తన ఫోన్ నే ఎత్తడం లేదని ఆక్షేపించారు. సరిగ్గా ఇవే ఆరోపణల్ని గతంలో జగన్ పై చంద్రబాబు చేయించారు. ఇప్పుడు ఆ కర్మ ఫలాన్ని రివర్స్ లో అందుకుంటున్నారు. 

బాబు 'కర్మ' కాలిందిలా..!

– గతంలో 23 మంది ఎమ్మెల్యేల్ని సంతలో పశువుల్ని కొన్నట్టు కొన్నారు. చివరికి బాబుకు గత ఎన్నికల్లో ఆ 23 ఎమ్మెల్యే సీట్లే మిగిలాయి.

– గతంలో వలసల్ని విపరీతంగా ప్రోత్సహించారు. ఇప్పుడు ఏకంగా తన పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు జారిపోయారు. బుచ్చయ్య రూపంలో ఐదో వికెట్ సిద్ధంగా ఉంది.

– ఎన్టీఆర్ ను వెన్నుపొటు పొడిచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు అదే వెన్నుపోటు తనను ఎవరు పొడుస్తారా అనే భయంతో బతుకుతున్నారు

– గతంలో వైసీపీ నేతల్ని, జగన్ ను ఇష్టమొచ్చినట్టు తిట్టారు. ఇప్పుడు దాదాపు అవే తిట్లను తను పడుతున్నారు.

– అధికారంలో ఉన్నప్పుడు అయినవాళ్ల కోసం మాత్రమే పనిచేశారు. దోచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఇప్పుడు పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి కొరత ఏర్పడింది. పార్టీ పరిస్థితి మునిగే నావలా తయారైంది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంశాలు తెరపైకొస్తాయి. బుచ్చయ్య చౌదరి ఎపిసోడ్ తో మరోసారి తెరపైకొచ్చిన ఈ ''కర్మ'' రాబోయే రోజుల్లో ఇంకెన్ని సార్లు చంద్రబాబు మెడకు చుట్టుకుంటుందో చూడాలి.