అమర రాజా.. లోకల్ రాజా కాదా..?

అమర రాజా ఫ్యాక్టరీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయ్యయ్యో అన్యాయంగా ఫ్యాక్టరీని తరలించేస్తున్నారు, రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలి వెళ్తున్నాయంయూ టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఫ్యాక్టరీ…

అమర రాజా ఫ్యాక్టరీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయ్యయ్యో అన్యాయంగా ఫ్యాక్టరీని తరలించేస్తున్నారు, రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలి వెళ్తున్నాయంయూ టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఫ్యాక్టరీ ఉన్న చిత్తూరు జిల్లా నుంచి మాత్రం టీడీపీ నేతలు నోరు మెదపలేదు. చంద్రబాబు, లోకేష్ సహా చాలామంది ఆపసోపాలు పడ్డా ఆ ఫ్యాక్టరీకి, ఫ్యాక్టరీ యాజమాన్యానికి స్థానికంగా మద్దతు కరువైంది.

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిలు అమర రాజా ఫ్యాక్టరీ వ్యవహారంపై సైలెంట్ గా ఉన్నారు. చంద్రగిరి ఇన్ చార్జి పులవర్తి నాని, శ్రీకాళహస్తి ఇన్ చార్జి బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి టీడీపీ ఇన్ చార్జి సుగుణమ్మ ఈ వ్యవహారంలో అసలు జోక్యం చేసుకోలేదు. దీంతో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. గల్లా ఫ్యామిలీ చిత్తూరులో ఫ్యాక్టరీ పెట్టినా జిల్లాకు చేసిందేమీ లేదని, వారి వల్ల పార్టీకి కానీ, నాయకులకు కానీ ఉపయోగం లేదనేది స్థానిక నాయకుల వాదన.

అమర రాజా ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగుల్లో 80శాతం మంది ఆ మూడు నియోజకవర్గాలకు చెందినవారే. ఫ్యాక్టరీ తరలిస్తారనే ప్రచారంతో ఉద్యోగులంతా ఒకింత ఆందోళనకు గురయ్యారు. సహజంగానే టీడీపీ నాయకుల్ని ఆశ్రయించి ఫ్యాక్టరీ వ్యవహారంపై మాట్లాడాలని సూచించారు. కానీ ఆ ముగ్గురు మాత్రం ససేమిరా అన్నారట. అది పూర్తిగా గల్లా ఫ్యామిలీ వ్యవహారమని, తమకే సంబంధం లేదని తేల్చి చెప్పారట.

చంద్రబాబు వద్దకు పంచాయితీ..

అమర రాజా వ్యవహారంతో చిత్తూరు టీడీపీలో అలజడి మొదలైంది. నియోజకవర్గానికి ఇన్ చార్జి లు ఉన్నా కూడా వారు ఇలాంటి పోరాటాలను పక్కనపెట్టేస్తున్నారని, అసలు పార్టీ కార్యకలాపాలే పూర్తిగా తగ్గిపోయాయని చంద్రబాబుకి స్థానిక చోటా మోటా నాయకులంతా ఫిర్యాదు చేశారట. 

అంతే కాదు, సోషల్ మీడియాలో కూడా ఇన్ చార్జిలను మార్చాలంటూ ట్రోలింగ్ మొదలైంది. దీని వెనక గల్లా జయదేవ్ ఉన్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం, స్థానిక ఎన్నికల్లో సంపూర్ణ ఓటమితో దిగాలుపడ్డ చంద్రబాబుని ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ మరింత కలవర పెడుతున్నాయి.