వైఎస్సార్‌టీపీ బాధ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక రాజకీయ పార్టీగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో తలపడాలా? వద్దా? అనేది తేల్చుకోవాలి. ఆ పని చేయకుండా డొంక తిరుగుడు వ్యవహారాలకు వైఎస్సార్‌టీపీ తెరలేపిందనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్న తర్వాత … ఆ రాష్ట్రంలో మొట్టమొదట హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక జరగనుంది.
హుజూరాబాద్‌లో పోటీ చేసేందుకు వైఎస్సార్‌టీపీ జంకుతోందని ఆ పార్టీ నడవడికే తెలియజేస్తోంది. ఎందుకంటే ఆదిలోనే అట్టర్ ప్లాప్ అయితే, అసలుకే మోసం వస్తుందని వైఎస్ షర్మిల భయపడుతున్నట్టు సమాచారం. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయకుండా ఉండేందుకు ఆ పార్టీ సాకులు వెతుకుతోంది. ఈ క్రమంలో హుజూరాబాద్‌లో తమ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదో ఇటీవల షర్మిల కారణాలు చెప్పు కొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ పరంపరలో తాజాగా తన స్టాండ్‌ను వైఎస్సార్‌టీపీ వెల్లడించింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసే నిరుద్యోగుల పక్షాన పార్టీ నిలుస్తుందని వైఎస్సార్‌టీపీ ప్రకటించింది. నిరుద్యోగులు వందల సంఖ్యలో మరణిస్తున్నా…ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని, నోటిఫికేషన్ల జారీలో జాప్యం చేస్తోందని పార్టీ విమర్శించింది.
సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలంటే హుజూరా బాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగుల పక్షాన వందల సంఖ్యలో నామినేషన్లు వేయించాలని ఆ పార్టీ నిర్ణయించడం గమనార్హం. నిరుద్యోగుల్ని తానే నిలబెట్టి, మద్దతు ఇవ్వడం ఈ ఉప ఎన్నికలో వైఎస్సార్‌టీపీ ప్రత్యేకత. ఈ మాత్రం దానికి తనే పోటీ చేస్తే సరిపోతుంది కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు పార్టీలోని ముఖ్యులంతా ఒక్కొక్కరుగా జారుకుంటుండంపై వైఎస్ షర్మిల ఆందోళనగా ఉన్నారని సమాచారం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే…అసలు వైఎస్సార్‌టీపీని రాజకీయ పార్టీగా తెలంగాణలో ఏ ఒక్క పార్టీ గుర్తించకపోవడం గమనార్హం. వైఎస్సార్‌టీపీ భవిష్యత్‌ను కాలమే నిర్ణయించాల్సి వుంది.