చంద్రబాబు జమానాలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు రూ.3.60 లక్షల కోట్లకు చేరాయి. వాటిలో కనీసం 50వేల కోట్లతో అమరావతిలో శాశ్వత భవనాలు నిర్మించలేకపోయారు. ఈ ఉదాహరణ చాలదా.. అమరావతి భ్రమరావతి అని చెప్పడానికి. రాజధాని తరలిస్తున్నారంటూ పెడబొబ్బలు పెట్టే టీడీపీ అండ్ కో.. కి అక్కడ శాశ్వత భవనాలెందుకు లేవో కనీసం చెప్పాల్సిన బాధ్యత లేదా.
తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీ కట్టేసి.. అదే రాజధాని అనుకోవాలంటే ఎలా? నవ్యాంధ్రకు తొలి సీఎం అయిన చంద్రబాబు.. చేసిన అభివృద్ధి తక్కువ, తెచ్చిన అప్పులు ఎక్కువ. రాజధాని కోసం ఖర్చు చూపిన లెక్కల్లో.. శాశ్వత నిర్మాణాలేవీ లేవు. కేవలం గ్రాఫిక్స్, ప్లాన్లు, విదేశాలతో ఒప్పందాలు, వాటాలు.. వీటికే సరిపోయాయి అంతా.
ఈ తతంగమంతా చూసే జగన్ కి మూడు రాజధానుల ఆలోచన వచ్చింది. అంటే ఒకరకంగా రాజధాని తరలింపు అనుకోండి, అభివృద్ధి వికేంద్రీకరణ అనుకోండి.. జగన్ కు వచ్చిన ఈ ఆలోచనకు పరోక్ష కారణం చంద్రబాబే. అమరావతి తరలిపోతోందంటూ ఏడుస్తున్న కొంతమంది.. అసలు తప్పు చంద్రబాబే చేశారనే విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు. గుర్తించినా ఎందుకు బయటకు చెప్పలేకపోతున్నారు?
మూడు రాజధానుల అంశాన్ని ప్రతి దశలోనూ వ్యతిరేకిస్తూ తన క్రూరత్వాన్ని చాటుకుంటున్నారు చంద్రబాబు. అడ్డుకునే అధికారం, హక్కు తమకు లేవని తెలిసినా కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. కేవలం తన సామాజిక వర్గానికి న్యాయం చేసుకోడానికే చంద్రబాబు కుతంత్రం పన్నారని బొత్స వంటి నాయకులు తీవ్ర విమర్శలు చేసినా అటునుంచి సమాధానం లేదు.
చంద్రబాబు తనకు అవకాశం ఉన్న ఐదేళ్లలో అమరావతి పేరు చెప్పి నాటకాలన్నీ ఆడారు కానీ.. ఒక్కటంటే ఒక్కటి కూడా శాశ్వత నిర్మాణం చేపట్టలేదు. గతంలో చంద్రబాబుకి ఎవరూ ఇలా అడ్డుపడలేదు కదా.. అవకాశం, అప్పు తెచ్చిన డబ్బులు రెండూ ఉన్నాయి. అయినా కూడా అమరావతిని వదిలేసి జేబులు నింపుకోడానికే చూశారు బాబు.
జగన్ ఏడాది లోపే మూడు రాజధానుల పనుల్ని వేగవంతం చేశారు. ప్రతిపక్షాలు అడ్డుతగలకపోయి ఉంటే.. ఈ పాటికే పనులు మొదలయ్యేవి. ఇప్పుడు అభివృద్ధి చేస్తానంటున్న జగన్ కి మాత్రం బాబు అడ్డుపడుతున్నారు. అమరావతి తరలింపుకి చంద్రబాబే కారణమంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు బాబు ఏమని సమాధానం చెబుతారు.