ఆసియా కప్ వాయిదా పడింది, టీ20 ప్రపంచకప్ కూడా వాయిదా పడింది. ఈ ఏడాది మెగా ఈవెంట్ నిర్వాహణ సాధ్యం కాదని ఐసీసీ తేల్చింది. ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వచ్చే ఏడాది జరుగుతుందని, రెండేళ్ల తర్వాత జరగాల్సిన టీ20 ప్రపంచకప్ యథావిధిగా సాగుతుందని, వన్డే వరల్డ్ కప్ మాత్రం ఆరు నెలల పాటు వాయిదా పడుతుందని ఐసీసీ ప్రకటించింది.
ఈ షెడ్యూల్ ప్రకారం.. ఈ ఏడాది అనగా 2020లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ 2021లో జరుగుతుంది. వచ్చే ఏడాది నవంబర్ లో జరుగుతుందట టీ20 ప్రపంచకప్. లెక్క ప్రకారం 2022లో మరో టీ20 ప్రపంచకప్ జరగాలి. అది యథావిధిగా జరుగుతుందట. దాని ప్రకారం 2021, 2022 లలో వరసగా రెండు టీ20 ప్రపంచకప్ లు జరుగుతాయి. ఇక ఎలాగూ 2023 వన్డే వరల్డ్ కప్ ఉండనే ఉంది. అది భారత్ వేదికగా జరగాల్సి ఉంది. మామూలుగా అయితే ఇండియాలో వేసవి సమయంలో వరల్డ్ కప్ ను నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం షెడ్యూల్ లు మారిపోయిన నేపథ్యంలో 2023 నవంబర్ సమయంలో వన్డే వరల్డ్ కప్ జరుగుతుందట!
ఇలా వరసగా మూడు సంవత్సరాల పాటు వరల్డ్ కప్ లు జరగనున్నాయి. ఆ సంగతలా ఉంటే ఐసీసీ ఈవెంట్ వాయిదా పడటంతో ఈ ఏడాది ఐపీఎల్ కు మార్గం సుగమం అయినట్టుగా తెలుస్తోంది. ఇండియాలో ఐపీఎల్ నిర్వహణ కూడా సాధ్యం కాదని తేలిపోయింది. ఈ క్రమంలో యూఏఈలో ఐపీఎల్ జరగనుందని సమాచారం. ఇప్పటికే ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయట. యూఏఈ ప్రయాణానికి విమానాలను కూడా బుక్ చేసుకుంటున్నాయట! ఈ ఏడాది సెప్టెంబర్- అక్టోబర్ నెలల్లో అక్కడ ఐపీఎల్ జరగబోతోందని సమాచారం.